అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాలో తొలి పాట ‘గణగణ మోగాలిరా…’ విడుదల చేశారు.
జాతర నేపథ్యంలో ‘గణగణ మోగాలిరా…’ పాటను తెరకెక్కించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బాణీకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా… వి.ఎం. మహాలింగం ఆలపించారు.
ఆల్రెడీ విడుదలైన ‘మంగళవారం’ టీజర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించింది. కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ‘ఏం చూశారండీ?’ అని లక్ష్మణ్ అడిగితే ‘ఒరేయ్ పులి! కాసేపు నువ్వు పువ్వు మూసుకుని గమ్మున ఉండరా’ అని అజయ్ ఘోష్ సమాధానం ఇవ్వడం… తుపాకీతో చైతన్య కృష్ణ గురి పెట్టడం… అమ్మవారి మాస్క్ ఎవరో తీసుకోవడం, గొంగళి కప్పుకొని మంటల మధ్యలో పాయల్ నిలబడటం, గట్టిగా ఆవేదన వ్యక్తం చేస్తూ అరవడం… ప్రతి విజువల్ ఓ ప్రశ్న వదిలింది.
చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన బాణీ అందించారు. కొన్నేళ్ళ పాట జాతరలలో ఈ పాట వినిపిస్తుంది. మా కథను కూడా చెప్పే పాట ఇది. ఇక సినిమా విషయానికి వస్తే… గ్రామీణ నేపథ్యంలో మన తెలుగు నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు.
‘మంగళవారం’ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది.