వరల్డ్ టూరిజం మ్యాప్‌లో ఆంధ్ర ప్రదేశ్ ను నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం బెస్ట్ టూరిజం పాలసీని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చే ప్రతి సంస్థకు చేయూతనిచ్చి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనిహామీ ఇచ్చారు. విజయవాడ గుణదలలోని ఈ ఎస్ ఐ బస్ స్టాప్ వద్ద నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు. విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్, ప్రముఖ హోటల్స్ రావాలని అన్నారు.
“ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభం చేసుకుంటున్న హయత్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలని, మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారందరికీ ఇలాంటి ప్రోత్సహకాలిచ్చి ఏపీని వరల్డ్ టూరిజం మ్యాప్‌లో పెట్టేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అంటూ భరోసా ఇచ్చారు.