ఉద్యోగుల కోసం తాము తీసుకు వచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) ను రాబోయే కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తాయని, ఇది దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జీపీఎస్ ను కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపామని, త్వరలోనే దీనికి ఆమోద ముద్ర పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల 21వ రాష్ట్ర కౌన్సిల్ సదస్సుకు సిఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జీపీఎస్ పై ఒకటిన్నర సంవత్సరం పాటు అద్యయనం చేశామని, ఉద్యోగులకు తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, చిత్తశుద్ధి ఉంది కాబట్టే దీనిపై తుదినిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయంలో గత ప్రభుత్వానికి, తమకు ఉన్న తేడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
తాము అధికారంలోని వచ్చిన తరువాత ఉద్యోగులపై పనిభారం తగ్గించామని, పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 కు పెంచామని, కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ ఉద్యోగులకు మేలు చేసే విషయంలో ఎక్కడా వెనుకంజ వేయలేదని చెప్పారు. 50 వేల మంది ఉద్యోగులున్న ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేశామని, గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని, 1998 డీఎస్సీ అభ్యర్ధులకు పోసింగ్ లు ఇచ్చామని, వైద్య ఆరోగ్య రంగంలో 53 వేల మందిని నియమించామని, మొత్తంగా 3 లక్షల 19 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని, వారి సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటామని చెప్పారు.
రెండు డీఏలు… 2022 జూలై, 2023 జనవరికి సంబంధించినవి పెండింగ్ లో ఉన్నాయని, 2022 జూలై డీఏను దసరా కానుకగా అందిస్తామని ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తోన్న మహిళా ఉద్యోగులకు మిగిలిన శాఖల మాదిరిగానే ఐదు రోజుల అడిషనల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, ఎవరి ప్రభావానికీ ఉద్యోగులు లోనుకావొద్దని జగన్ పిలుపు ఇచ్చారు. ఆర్ధిక ఇబ్బందులవల్ల మీరు ఆశించిన స్తథాయిలో తాను చేయలేకపోవచ్చని, కానీ ఉద్యోగుల పట్ల మనసునిండా ప్రేమ ఉందని చెప్పారు.