Wednesday, November 27, 2024

ఎరుపు కలలు

Red-Light:

విలేఖరి:-
సార్! మీరెన్ని సీట్లడిగారు? వారెన్ని ఇస్తామన్నారు? ఎందుకు పొత్తు కుదరలేదు?

నాయకుడు:-
మేము చెరి రెండున్నర సీట్లు అడిగాము. వారు చెరి రెండూ పాయింట్ ఇరవై అయిదే అన్నారు. పాయింట్ టూ ఫైవ్ దగ్గర సైద్ధాంతిక విభేదాలు వచ్చాయి. పోయినసారితో పోలిస్తే పెరిగిన మా బలం పాయింట్ టూ ఫైవ్ దామాషా ప్రకారమే మేము పొత్తుల్లో మెత్తటి సీట్లు ఆశించాము.

వి:- సైద్ధాంతిక విభేదాలు అన్నారు. అంటే ఏమిటి సార్?

నా:-  నయా వలసవాద రివిజనిస్టు ఎలుకలతో, సామ్రాజ్యవాద విషపు కోరల సర్పాలతో, బూర్జువా భూస్వాముల గడ్డివాము దగ్గర కుక్కలతో, మతోన్మాద శక్తులను ప్రేరేపించే మానవ మృగాలతో, విదేశీ పెట్టుబడిదారుల గోతికాడ పెట్టీ నక్కలతో, తిరోగామి శక్తులకు కాపు కాచే పిల్లులతో మాకు సైద్ధాంతికంగా తీవ్రమైన విభేదాలున్నాయి. వారితో మేము పని చేయదలచుకోలేదు.

వి:- సార్! ఏదో ఫారెస్ట్ ఆఫీసర్ జంతు సంరక్షణ గురించి ఎంతో ఆవేదనగా చెప్పినట్లు…ప్రజాస్వామ్య పరిభాష అనుకుని జంతుస్వామ్య పరిభాష వాడుతున్నారు. మరి ఎవరితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు?

నా:-  లౌకిక ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణ కోరే విశాల ప్రాపంచిక సమసమాజ నవసమాజ నిర్మాతలతో కలిసి పని చేయాలని మా కార్యవర్గ కార్యదర్శుల బృందం పిడికిలి బిగించి నిర్ణయం తీసుకుంది.

వి:- …అంటే ఈ నిర్మాతలు సినిమాలే కాకుండా ఓ టీ టీ సినిమాలు, వెబ్ సీరీస్ కూడా తీసేవారై ఉంటారా సార్?

నా:- ఆ నిర్మాతల్లో కొందరు మా సబ్జెక్ట్ సినిమాలు తీసేసరికి మీరు పొరబడినట్లున్నారు. మా మెంబర్ షిప్ ఐ డి కార్డు వేరు. వారి ‘మా’ మెంబర్ షిప్ ఐ డి కార్డు వేరు. వారి డి ఎన్ ఏ వేరు. మా డి ఎన్ ఏ వేరు.

వి:- మీరు ఇప్పటి దాకా ఏయే పార్టీలకు తోక పార్టీలుగా పని చేశారు? అలా చేయడం వల్ల మీరు సాధించిన లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్ని టన్నులకు తూగింది? లేక మీ తోకలు ఎన్ని అడుగుల మేర తెగింది?

నా:- ప్రజలకోసం మేము తన్నులు తినడానికే పుట్టినవాళ్లం. టన్నులు లెక్క పెట్టుకోలేదు. డార్విన్ మానవ పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం లక్షల ఏళ్ల క్రితమే మనందరి తోకలు అంతరించిపోయాయి కాబట్టి…మనుగడలో లేని తోకల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు.

వి:- మీ రంగు, రూపం, స్వభావం, లక్ష్యం అన్నీ అంతా ఒకటే అయినప్పుడు రెండుగా ఉన్నారెందుకు? ఒకటి కావచ్చు కదా?

నా:- ఇదొక గతి తార్కిక భౌతిక వాద; కాలానుగత ద్వైదీభావ; పరస్పర తీవ్ర అభిప్రాయ వైరుధ్య వేళ జరిగిన హఠాత్పరిణామ విభజన. సైద్ధాంతిక పునాదుల మీద విశాల జనహితం కోసం మళ్లీ ఒకటి కావాలని ఎన్నెన్నో కలలు కన్నా…ఎందుకో అవి కల్లలు అయ్యాయి. దీనిమీద రష్యా మీదుగా చైనా వెళ్ళినప్పుడు ఆలోచించినా పరిష్కారం కనపడలేదు. చైనా కళ్ళజోడు పెట్టుకుని రష్యాలో విడిది చేసినప్పుడు కూడా అక్కడి మైనస్ టెంపరేచర్ దెబ్బకు వణుకు పుట్టి…నిలువెల్లా మేమే కదిలిపోయాము తప్ప…మా పునరేకీకరణలో కదలిక రాలేదు. కానీ…ప్రపంచ తాడిత, పీడిత, కార్మిక, మార్మిక వర్గ సమైక్యతకు, బూర్జువా స్వామ్య కోటలు బద్దలు కొట్టి…నిరుపేదల జెండా ఎర్రకోటమీద ఎగుర వేసే అరుణారుణ ఉషోదయ వేళ ఎంతో దూరంలో లేదని…మొన్ననే విమానంలో ఢిల్లీలో ఉషోదయ వేళ ల్యాండ్ అవుతుంటే ఎర్రకోటను విమానం కిటికీలో చూసినప్పుడు మాత్రం ఎందుకో గట్టిగానే అనిపించింది.

వి:- మొన్న మీరిద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఏమి మాట్లాడుకున్నారు సార్?

నా:- ఔర ప్లస్ ఔర ఈజ్ ఈక్వల్ టు ఔరర అన్నది “ఆమ్రేడిత”సంధి అని మీకు తెలియనిది కాదు. మెరుపులా కామ్రేడ్ల ఎరుపు-ఎరుపు ఎదురుపడితే “కామ్రేడిత సంధి” అవుతుందా? కాదా? అని ఎదురెదురుగా కూర్చుని అరుణాక్షర నిఘంటువులు, వ్యుత్పత్తి పదకోశాలు, టీకా తాత్పర్య అరుణవర్ణ అలంకార శాస్త్ర గ్రంథాలు ముందు పెట్టుకుని భాషా పరిణామక్రమ సిద్ధాంతం ప్రకారం మాట్లాడుకున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు అచ్చునకు పొత్తుల ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుందనే ఆపత్కాల “కామ్రేడిత”వ్యాకరణ శాస్త్ర మీమాంస మీద మొన్న మా చర్చలు అసమగ్రంగా ముగిశాయి. స్థూలంగా కామ్రేడిత సంధి కుదిరినా…ఎరుపు ప్లస్ ఎరుపు- ఎరుపెరుపు అవుతుందని ఒక వర్గం; ఎర్రెరెపు అవుతుందని మరో వర్గం సైద్ధాంతికంగా విభేదించుకోవడంతో…త్వరలో మరోసారి కలిసి…కనీస ఉమ్మడి కామ్రేడిత కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నాం.

వి:- సార్! మీరెప్పుడూ మాకు గాజు గ్లాసులో టీ ఒక్కటే ఇచ్చేవారు. ఈసారి కాల్చిన మొక్కజొన్న పొత్తు కూడా పెట్టారు. ఆ పొత్తు పక్కనేమో విచిత్రంగా వేయించిన కరివేపాకు కూడా ఉంది. టీ గాజు గ్లాసులో కాకుండా యూజ్ అండ్ త్రో పేపర్ కప్పులో ఇచ్చారు. ఏ ప్రస్థానానికి ఈ పయనం? ఏ సందేశానికి ఈ ప్రతీకలు ప్రతిబింబం?

నా:- ఎంతయినా విలేఖరులకు కూడా మెదడుంటుందని మరో సారి రుజువు చేసుకున్నారు. సరిగ్గా పట్టుకున్నారు పాయింట్. మేము అంటకాగిన పార్టీ మమ్మల్ను యూజ్ అండ్ త్రో లా, కరివేపాకులా వాడుకుని పారేసిందని చెప్పడానికి యూజ్ అండ్ త్రో కప్, కరివేపాకు; పొత్తు పెట్టుకోకుండా మా గుండెల మీద నిప్పుల కొలిమి పెట్టిందని చెప్పడానికి నిప్పుల కొలిమిలో కాల్చిన మొక్కజొన్న పొత్తులను ప్రతీకాత్మక ప్రజాస్వామ్య నిరసనగా పెట్టాము.

వి:- ఎప్పటికైనా మీరు కోరుకునే ఎర్రకోట మీద జెండా ఎగరేసే మరో ప్రపంచం వస్తుందా? కనీసం వస్తుందనే నమ్మకమైనా మీకుందా?

నా:-  శ్రీశ్రీ మరో ప్రపంచం ఎప్పుడో వచ్చింది. అనేక పునర్ముద్రణలు కూడా వచ్చాయి. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో మరో ప్రపంచం సినిమా కూడా ఏనాడో వచ్చేసింది. ఇప్పుడు మనమున్నది మరో ప్రపంచంలోనే.

వి:-  ..అయితే మనం వెళ్లాల్సింది మరో మరో ప్రపంచంలోకేమో సార్!

నా:- మొత్తం ఉన్న అయిదు వందల స్థానాల్లో మేము ఉమ్మడిగా పోటీ చేయడానికి అనువైనవి అనుకుంటున్న అయిదు స్థానాల్లో పోటీ ద్వారా ఆ దిశగానే మేం అడుగులు వేస్తున్నాం. ఆ మరో మరో ప్రపంచం కోసం తగ్గేదే ల్యా!

వి:-  తగ్గద్దు సార్! తగ్గనే తగ్గద్దు!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోవాలి పై పైకి!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్