సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9 తన పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తన పై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు మహేష్ బాబు పిలుపునిచ్చారు. దీనిపై ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
తన అభిమానులు ప్రతి ఒక్కరూ తలా మూడు మొక్కలు నాటాలని పిలుపునివ్వడం గొప్ప విషయమని అన్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త ఎంపీ సంతోష్ కుమార్. జన హృదయాల్లో ప్రిన్స్ గా వున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పిలుపు తన హృదయాన్ని కదిలించిందని ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. మహేష్ బాబు వంటి గొప్పవ్యక్తుల మద్దతుతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, సంతోష్ తన ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా తన పుట్టిన రోజును పురస్కరించుకుని మహేష్ బాబు మొక్కలునాటారని ఎంపీ సంతోష్ కుమార్ గుర్తు చేసుకున్నారు.
భౌతిక ఆస్తులు, అంతస్తులు మాత్రమే కాదని, రేపటి తరాలకు మనం కూడబెట్టాల్సింది వారు సుఖంగా జీవించడానికి కావాల్సిన ప్రకృతి పచ్చదనాన్ని అందించడమే మన కర్తవ్యంగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అంటుంటారని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ హరితహారం స్పూర్తితో తాను కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మహేష్ బాబు పాలుపంచుకోవడం గొప్ప విషయమని అది ఆయన అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమన్నారు.
మహేష్ బాబు పిలుపు మేరకు ఆగస్టు 9 న మనిషికి వొక్కంటికి మూడు మొక్కలు నాటుతున్న ప్రపంచ వ్యాప్తంగా వున్న మహేష్ బాబు అభిమానులకు ఎంపీ సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. మహేష్ బాబు పేరుతో నాటుతున్న మొక్కలు వృక్షాలుగా పెరిగి పెద్దవయి ఎందరికో నీడనిస్తూ చిరకాలం నిలుస్తాయని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.