తెలంగాణలో భూములు అమ్మనిదే, మద్యం అమ్మనిదే.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావు ఆయన సతీమణి దీపాతో కలిసి బుధవారం కమలం పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
వచ్చే ఎన్నికల్లో వికాస్ రావు వేములవాడ నుంచి బరిలో దిగనున్నాడు. వేములవాడలో ఏడాదిగా వికాస్ రావు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వికాస్ రావు తండ్రి విద్యాసాగర్ రావు కేంద్రమంత్రిగా పని చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ గా పని చేశారు. గతంలో మెట్ పల్లి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావు గెలిచారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… దేశంలో అత్యధిక పెట్రోల్ ధరలు తెలంగాణలోనే ఉన్నాయని విమర్శించారు. కేంద్రప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. ఆర్టీసీ ఛార్జీలు,భూముల రిజిస్ట్రేషన్, ఔస్ ట్యాక్సీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు నెలల ముందే వైన్స్ లకు టెండర్లు పిలిచి సొమ్ము చేసుకున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒప్పందం కుర్చుకుని పార్టీ ఆఫీసులకు ల్యాండ్ కేటాయించారని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, ఎంపి ధర్మపురి అరవింద్, మరో ఎంపి కే లక్ష్మణ్ , జగిత్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.