ఆడబిడ్డల కోసం తాము ప్రవేశ పెట్టిన మహా శక్తి ఓ గేమ్ ఛేంజర్ కాబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ప్రతి పార్టీ ఈ పథకం చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఏటా ‘ తల్లికి వందనం’ కింద 15 వేల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో మనిషిని ఒక ఆస్తిగా చూడాలని, భూమిని, డబ్బ్బును కాదని… వీటిని సంపదించేది కూడా మనుషులేనని అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ‘మహాశక్తి-రక్షా బంధన్’ కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రతకు, సాధికారతకు ప్రాధ్యాన్యం ఇచ్చే పార్టీ టిడిపియేనని, అన్నలా వారికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేందుకే మహాశక్తి పథకాన్ని ప్రకటించామని చెప్పారు.
తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడే మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టామని మహిళల ఆత్మ ఆత్మగౌరవం కాపాడడం కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని… మహిళల పేరిటే ఆస్తులు అందించామని.. ఆడ పడుచులు కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతుంటే ప్రతి ఇంట్లో దీపం వెలిగించి వంట గ్యాస్ ఇచ్చామని… డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని, పసుపు కుంకుమ కింద పది వేల కోట్ల రూపాయలు అందించామని… బేబీ కిట్, తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్, బాలామృతం పథకాలు పెట్టామని, సామూహిక శ్రీమంతాలు కూడా జరిపించిన ఘనత కూడా తమకే దక్కిందన్నారు. తల్లికి వందనం పేరిట పిల్లలు తల్లులను గౌరవించేలా చేశామన్నారు.
తెలుగుదేశం పార్టీ గెలవాలన్న లక్ష్యం, ఆశయంతో మహిళలు పనిచేయాలని, రోజుకు రెండు గంటలపాటు పార్టీ కోసం ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. సంపద సృష్టించడానికి ఇది అనువైన సమయమని అందుకే పార్టీని గెలిపించాలని కోరారు.