Saturday, November 23, 2024
HomeTrending NewsSajjala: ఎన్టీఆర్ ఆత్మకు మరోసారి క్షోభ: సజ్జల

Sajjala: ఎన్టీఆర్ ఆత్మకు మరోసారి క్షోభ: సజ్జల

పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని, ఆ ధైర్యం ఆయనకు  లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాలలో అభ్యర్దులను నిలిపే సత్తా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు.  తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో బుధవారం ఆయన మాట్లాడారు. బిజేపితో పొత్తుకోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని, పూర్తిగా నమ్మకం కోల్పోయి, డీలా పడ్డ టిడిపి కార్యకర్తలను కాపాడుకునేందుకు చంద్రబాబు యధాశక్తి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళే దమ్ము లేదని, గతంలో బిజేపిని, నరేంద్రమోదిని తిట్టిన చంద్రబాబు నేడు అదే నోటితో పొగుడుతున్నారని అన్నారు. చంద్రబాబు గంటకు గంటకు మాటలు మారుస్తుంటాడు…ప్రజలకు జ్ఞాపకం ఉండదనే భావనలో ఉంటాడని అందుకనే తరచూ మాటలు మారుస్తుంటాడని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని పిలవకుండా ఎన్టీఆర్ ఆత్మను మరోసారి క్షోభకు గురిచేశారని సజ్జల వ్యాఖ్యానించారు. “ఈ విషయంలో నీచ రాజకీయాలు చేశారు. చంద్రబాబు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు. రాజకీయాలు ప్రజలకోసం ఉండాలి. ఎన్టీఆర్ ను చంద్రబాబు వీలున్నప్పుడల్లా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ ఆత్మఘెష పెడుతూ ఉంటుంది. ఎన్నివేల సార్లు వెన్నుపోటు పొడిచి ఉంటాడో తెలియడం లేదు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు భార్య. అలా కాదని చంద్రబాబు,లేదా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు భావిస్తుంటే అది ప్రజలకు చెప్పాలి. ఎన్టీఆర్ వివాహం చేసుకున్న విషయాన్ని కూడా కాదని చెబుతూ ఆమె నీ భార్య కాదని చెబుతున్నారంటే వారు ఎంత దిగజారుడుగా ప్రవర్తిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు” అన్నారు.

మరుగుజ్జు లాంటి చంద్రబాబు శిఖరం లాంటి ఎన్టీఆర్ ను ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకుంటున్నారన్నారు.  ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీఆర్ కుమారులు చంద్రబాబు చేతిలో పావుగా ఉంటున్నారన్నారు. పురంధేశ్వరి చంద్రబాబుకు,టిడిపికి ఏజంట్ లాగా మారారని, ఆమెతోపాటు పవన్ కల్యాణ్  కూడా బిజేపి, టిడిపి-జనసేన పొత్తుకోసం పైరవీలు చేస్తున్నారన్నాని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్