అమెరికా పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. వాషింగ్టన్ డీసి లోని NIFA (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) సందర్శించారు. NIFA డైరెక్టర్, మంజిత్ మిశ్రా, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పరిశోధన రంగంలో USDA (యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) సహకారం ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే మా ఆకాంక్ష అని తెలిపారు. భావితరాలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చూసుకునే బాధ్యత మనపై ఉన్నదన్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (NIFA) US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) కి చెందిన ఏజెన్సీ. అమెరికాలో వ్యవసాయాన్ని మెరుగుపరిచే పరిశోధనలు చేయడం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం, కావలసిన నిధులు సమకూర్చడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, పర్యావరణ సమతుల్యత పాటించేలా చూడడం NIFA ప్రధాన లక్ష్యాలుగా సంస్థ పనిచేస్తుంది.
ఈ సమావేశంలో NIFA డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ… ఏ దేశంలో అయినా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యం అని, ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకం అని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్‌లో ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ని కలిశానని ఆయన వివరించారు.
ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మ్యానేజ్మెంట్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యుయర్ ప్లాంటింగ్ టెక్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాల గురించి మూడో రోజు పర్యటనలో USDA ప్రతినిధులతో మంత్రి బృందం చర్చలు జరిపింది. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ లు పాల్గొన్నారు.