ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, ప్రజల్లో ఆందోళన కలిగించేలా తప్పుడు రాతలు రాస్తోందని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేక వక్రీకరిస్తోందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షపై క్యాంపు కార్యాలయంలో సిఎంజగన్ సమీక్ష నిర్వహించారు.
భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృత్రంగా ప్రచారం చేయాలని, రెవిన్యూ విభాగంలో విప్లవాత్మక విధానాలు , సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి కారణంగా ప్రజలకు జరుగుతున్న మంచిని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు:
⦿ చాలా రాష్ట్రాల్లో మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉంటే మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో కూడా సర్వేయరు ఉన్నారు
⦿ భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోంది
⦿ రిజిస్ట్రేషన్ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నాం
⦿ ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది
⦿ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నాం
⦿ ఇన్ని సౌలభ్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తుంటే దానిపై తప్పుడు రాతలు, వక్రీకరణలు చేస్తున్నారు
⦿ మన ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలు, వాటి వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను సమగ్రంగా వివరించాలి
⦿ మనం చేస్తున్న ఈ మంచి ప్రజల్లోకి పోవాలి… అంటూ దిశా నిర్దేశం చేశారు.
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం సమగ్ర సర్వేలో ప్రగతిని అధికారులు సిఎంకు వివరించారు. 13,460 గ్రామాలకు గాను, 12,836 గ్రామల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లైయింగ్ పూర్తయిందని, ఈ పనిని అక్టోబరు 15లోగా పూర్తిచేస్తామని వివరణ ఇచ్చారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ ముగిసిందని, 60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను జిల్లాలకు పంపే పని పూర్తిచేయాలసి ఉందని తెలిపారు. 3,240 రోవర్లు సర్వేలో పాలు పంచుకుంటున్నాయని వెల్లడించారు.