యువగళం పాదయాత్ర ప్రజాగళంగా మారిందని, ప్రజలు ఊళ్లకు ఊళ్ళు తరలివస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజా స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కల్యాణదుర్గంలో ‘వ్యవసాయ సంక్షోభంపై ప్రజా వేదిక’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో అలజడి సృష్టించారని, యువ గళం యాత్రలో వైసీపీ వారే దాడులు చేసి మళ్ళీ తమ పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారని, గతంలో పుంగనూరులో తన కాన్వాయ్ పై దాడి చేసి ఎదురు తనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారని చెప్పారు.
విపత్తులు వచ్చినప్పుడల్లా ఈ జిల్లా రైతాంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, అందుకే తాము హంద్రీ నీవాను పూర్తి చేయాలన్న లక్ష్యంతో దాదాపు 4,900 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ స్ప్రింకర్లు ఇచ్చామని, హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ ప్రభుత్వం సీమ ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్షం చేసిందని, వేరు శనగ పంట కూడా చేతికి అందని పరిస్థితి నెలకొని ఉందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వేరు శనగకు పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకున్నామని, బీమా సౌకర్యం తీసుకొచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులపై కూడా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ సంక్షోభం నివారించాలంటే నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ రాష్ట్రానికే ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని బాబు పేర్కొన్నారు.