రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సరైన సమీక్ష కూడా చేయలేకపోతున్నారని బిజెపి అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ఓవైపు డిమాండ్ కు సరిపడా విద్యుత్ ను సప్లై చేయలేక పోతున్నారని, మరోవైపు చార్టీలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ళలో రెండు మూడు రెట్లు అధికంగా ఛార్జీలు పెంచారన్నారు. ఈ ఒక్క నెలలోనే 700 కోట్ల రూపాయల అధిక భారం ప్రజలపై ప్రభుత్వం వేయబోతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అధికంగా ఉన్నాయని, పట్టణాల్లో కూడా అప్పుడప్పుడూ కోతలు ఉన్నాయన్నారు. ప్రణాళిక, నిర్వహణ లోపాలే దీనికి కారణమన్నారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దినకర్ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ అసమర్ధత వల్లే నాలుగు రూపాయలకు కొనాల్సిన విద్యుత్ ను 26 రూపాయలకు బహిరంగ మార్కెట్ లో కొనాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 2022-23 సంవత్సరానికి 66,830 మిలియన్ యూనిట్లు విద్యుత్ రాష్ట్రం వినియోగించుకుందని, రోజుకు సగటున రోజుకు 180 యూనిట్లు అవసరమని, కానీ ఆర్ధిక సంవత్సరంలో ఇది రోజుకు 250 మిలియన్ యూనిట్లకు పెరిగిందన్నారు. ఆగస్ట్ నెలలో థర్మల్, హైడల్, సోలార్ పవర్ installed Capacity 5,589 మెగావాట్లు అయితే ఏపీ జెన్కో ఉత్పత్తి చేసింది 1,983.69 మెగావాట్లు మాత్రమేనని వెల్లడించారు. ఇప్పటికీ ఎనిమిదిసార్లు ఛార్జీలు పెంచారని, మధ్యలో ట్రూ అప్; సర్ ఛార్జీలు, ఇతరత్రా పేరిట ప్రజల నడ్డి విరిచేలా వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
పాలనా నిర్వహణ, పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు గౌరవించకుండా అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, పిపిఏలు రద్దు చేయడం లాంటి నిర్ణయాలతోనే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు 64, 183 కోట్ల అప్పుల్లో, 29, 928 కోట్ల నష్టాలతో ఉన్నాయని వివరించారు.