ఎలాంటి ప్రాథమిక ఆధారాలు చూపకుండా తనను అదుపులోకి తీసుకున్నారని, ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుమీద హత్య చేశారని, ఇది చాలా బాధాకరమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సామాన్యులకు కూడా అరెస్ట్ పై ప్రశ్నించే హక్కులు ఉంటాయని, అలాంటిది తన తప్పేమిటో చూపాలని అడిగినా, అక్రమంగా తనను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్ ఐ ఆర్ కాపీలో కూడా తన పేరు ప్రస్తావించలేదని అన్నారు. ప్రభుత్వ అణచివేత కార్యక్రమాల్లో భాగంగానే ఇది జరిగిందన్నారు. తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని, నిజంగా తప్పు చేసి ఉంటె నడిరోడ్డుపై ఉరి వేయాలని సవాల్ చేశారు.
నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై తాను పోరాడుతున్నానని, అందుకే తనను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయనీయకుండా ప్రణాళిక ప్రకారమే అరెస్టు చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని.. ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. గత రాత్రి నుంచి ఈ ప్రాంతంలో భయభ్రాంతులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.