ANR Centenary Special: నటనకు నిలువెత్తు నిదర్శనం మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని రామాపురంలో జన్మించారు. నేడు ఆయన శత జయంతి సంవత్సరం మొదలవుతోంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహానటుడు అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి చిత్రం ధర్మపత్ని అయినప్పటికీ.. కథానాయకుడుగా జన్మించింది మాత్రం సీతారామ జననం చిత్రంతో. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎన్నో విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించి.. ఆ పాత్రలకే వన్నెతెచ్చారు అక్కినేని. పౌరాణిక, సాంఘిక, జానపద సినిమాల్లో అద్భుతంగా నటించి అలరించారు నట సమ్రాట్. నాటక రంగం నుండి సినిమాల వైపుకు వచ్చిన అక్కినేని సీతారామ జననం చిత్రంతో మొదలుకుని.. దసరా బుల్లోడు, మాయాబజార్, బాలరాజు, రోజులు మారాయి, మిసమ్మ, గుండమ్మకథ, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, ఇల్లరికం, ధర్మదాత, బాటసారి, దేవదాసు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘసందేశం, సీతారామయ్య గారి మనమరాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరపురాని చిత్రాలున్నాయి.
నవరాత్రి చిత్రంలో అక్కినేని తొమ్మిది పాత్రలు పోషించారు. ఈ సినిమాలో కోపిష్టి గోపన్నగా, పల్లెటూరు రైతు శాంతన్నగా, కుష్టు రోగి సుందరామయ్యగా, భాగవతారు శ్రీనివాసులుగా, పోలీస్ ఆఫర్ గా, నవ ప్రేమికుడు వేణుగా, డాక్టర్ కరుణాకరర్ గా, దేవదాసుగా, ఆనందరావుగా.. ఇలా ఒకే చిత్రంలో తొమ్మిది పాత్రలు పోషించిన ఏకైక తెలుగు నటుడుగా అక్కినేని నాగేశ్వరరావు రికార్డ్ క్రియేట్ చేశారు.
అక్కినేని మాటల మనిషి కాదు, చేతల మనిషి. అందుకే.. ఆయన అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకోలేదు. శ్రమనే పెట్టుబడిగా పెట్టి, తనదైన కోణంలో తెలుగు తెర పై వెలిగిపోయిన రొమాంటిక్ హీరో ఆయన. కానీ.. నాగేశ్వరరావు.. ఏఎన్నార్ గా మారడానికి చాలా కృషి చేశారు. మద్రాసు మహానగరంలో అడుగుపెట్టిన రోజున ఆయనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఆయన పెద్దగా చదువుకోలేదు. అలాంటిది ఏఎన్నార్ గొప్ప మాటలను రాసే స్థాయికి ఎదిగారు. అ..ఆ లు అంటే.. అక్కినేని ఆలోచనలు అనే మంచి పుస్తకాన్ని రాయగలిగారు. అంతే కాదండోయ్ ఇంగ్లీషులో కూడా అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారంటే.. ఎంత పట్టుదల గల మనిషో అర్థం చేసుకోవచ్చు.
అక్కినేని నాగేశ్వరరావు అనగానే దేవదాసు సినిమా గుర్తొస్తుంటుంది. దేవదాసు సినిమాలో తాగుబోతు పాత్రలో అక్కినేని నటించలేదు.. జీవించారు. ఎన్ని భాషల్లో దేవదాసు చిత్రాన్ని తీసినా.. అక్కినేని నటించినంతగా ఎవరూ నటించలేకపోయారు అంటే.. ఆ పాత్రలో ఎంత అద్భుతంగా నటించారో అర్థం చేసుకోవచ్చు. అక్కినేని నిజంగానే తాగి నటించారా..? అన్నట్టుగా ఆ పాత్రలో లీనమై నటించారు. అయితే.. ఈ పాత్ర కోసం ఒక్కసారి కూడా అక్కినేని తాగకపోవడం విశేషం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇలా ఎన్నో క్లాసిక్స్ లో నటించారు అక్కినేని. ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన పోషించిన ఎన్నో అద్భుత పాత్రల రూపంలో ఎప్పటికీ బ్రతికే ఉంటారు. ఆయన శత జయంతి వేడుకలను ఈ సంవత్సరం అంతా ఏదో కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేశారని సమాచారం.