Saturday, November 9, 2024
HomeTrending NewsPadmashali: పద్మశాలి ఓట్లు.. వెలమ సీట్లు...

Padmashali: పద్మశాలి ఓట్లు.. వెలమ సీట్లు…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిసీ జనాభా అధికంగా ఉన్నా…పదవుల పందేరంలో వెనుకబడే ఉన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన పద్మశాలి సామాజిక వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వర్గం వారు ఎంత చైతన్య వంతులు అంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే ముంబై, బీవండి, షోలాపూర్ ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. భీవండి సాంచెలు, చేనేత కార్మాగారాల్లో కార్మికులుగా జీవితాలు ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగారు. రెండో తరం వచ్చే వరకు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.

దశాబ్దాలుగా మహారాష్ట్రతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అనుబంధం ఉంది. ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల నియోజవర్గాల్లోని పద్మశాలీల్లో బంధుత్వాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. సిఎంగా ఎన్టీఆర్ వచ్చాక బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చారు. దీంతో ముంబైతో పాటు హైదరాబాద్ రాకపోకలు పెరిగాయి. కాలక్రమంలో విద్య, ఉపాధి కోసం హైదరాబాద్ రావటం పెరిగినా ముంబైతో అనుబంధం వీడలేదు.

వ్యాపారాల్లో రాణించటం, ఆర్థికంగా నిలదొక్కుకున్నా పేదరికం కూడా ఈ సామాజిక వర్గంలో ఉంది. 25 ఏళ్ల క్రితం నాలుగు నియోజకవర్గాల్లో బీడీలు చేయని పద్మశాలి కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. 95 శాతం కుటుంబాలకు పూట గడవాలంటే బీడీలు చుట్టడమే… ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు జీవనాధారం అదే.

వేములవాడలో కొంత తక్కువ అయినా మూడు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ఖరారు చేయకలిగిన స్థితిలో ఉండి ఏనాడు ఉన్నత పదవులు అందుకోలేకపోయారు. బుగ్గారం నియోజకవర్గం నుంచి 1978లో అంబల్ల రాజారామ్, 1983లో కడకుంట్ల గంగారంలు ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించారు.

కోరుట్లలో అంబల్ల మాధవి, పోతని భూమయ్య పురపాలక సంఘ చైర్ పర్సన్ గా పదవులు చేపట్టారు. ఇద్దరిలో అంబల్ల మాధవి ఎమ్మెల్యే స్థాయి నాయకురాలైనా.. అప్పుడు బిజెపిలో చెన్నమనేని విద్యాసాగర్ రావు మర్రి మాను కావటంతో ఆమె రాజకీయ పయనం కొనసాగలేదు.

సిరిసిల్లలో చెన్నమనేని రాజేశ్వర్ రావు, మంత్రి కేటిఆర్ లే ఎక్కువ కాలం శాసనసభ్యునిగా ఉన్నారు. సిరిసిల్లలో గాజుల బాలయ్య, గుండ్లపల్లి శ్రీనివాస్, పులి విట్టల్, లైశెట్టి శ్రీనివాస్, కొక్కుల దయానంద్ తదితర నాయకులు ఉన్నా శాసనసభ్యులుగా ఎదగలేకపోయారు. సిరిసిల్లలో మున్సిపల్ చైర్మన్ స్థాయి వరకే చేరుకున్నారు.

జగిత్యాల నుంచి ఎల్ రమణ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల బోగ శ్రావణి మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి చేపట్టినా ఎమ్మెల్యేతో విభేదాలతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. బోగ శ్రావణి పార్టీ వీడెందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కుట్రలే కారణమని ఆ సామజిక వర్గంలో పాతుకుపోయింది. తాజాగా బోగ శ్రావణి బిజెపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

టిడిపి నుంచి ఇటీవల బీ.ఆర్.ఎస్  లో  చేరిన రమణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ ఎల్ రమణ వెన్నముక లేని నాయకుడు. సిరిసిల్లలో కేటిఆర్ ను బలోపేతం చేసేందుకు ఎమెల్సీ పదవి ఇస్తే ఎగేసుకొని ఎంబడి తిరుగుతున్నాడు. జగిత్యాలలో బోగ శ్రావణి పార్టీ వీడుతున్నా…అంటీముట్టనట్టు వ్యవహరించారు.

ఎల్ రమణకు పదవి ఇవ్వటంతో నాలుగు ప్రాంతాల్లో పద్మశాలీల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. రమణ వైఖరితో ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగలేకపోయారు. ఈయన వారిని ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వారు పాలక వర్గం వేసే చిన్న చితకా పదవులకు లొంగిపోయే దుస్థితి దాపురించింది. నాలుగు నియోజకవర్గాల్లో వెలమ సామాజిక వర్గం వారే శాసనసభ్యులుగా ఉండటం గమనార్హం. సిరిసిల్ల – కేటిఆర్, వేములవాడ – చెన్నమనేని రమేష్, కోరుట్ల- కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల- సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

Ktr With Munugode Voters

జగిత్యాలలో 36 వేలు, కోరుట్లలో 65 వేలు, సిరిసిల్ల లో 85 వేములవాడలో 20 వేల వరకు పద్మశాలీల ఓట్లు ఉన్నాయి. కులంలో అనైక్యత ఇతరులకు మేలు చేకూరుస్తోంది. పద్మశాలీల్లో వ్యాపారులు, ఉద్యోగులు సంఘాలుగా సహకరించుకుంటున్నా పేదరికంలో మగ్గుతున్న వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు.

కోరుట్లలో ఇటీవల పద్మశాలి బహిరంగ సభ నిర్వహించినా వ్యక్తిగత పరపతి పెంచుకోవడానికి కొందరు నేతలకు ఉపయోగపడింది. సామాన్య నేతన్నలకు ఒరిగింది శూన్యం. సామజిక వర్గానికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత దక్కేలా రాబోయే ఎన్నికల్లో నేతన్నలు సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్