Friday, September 20, 2024
HomeTrending NewsJanareddy: మాజీ మంత్రి జానారెడ్డి సన్నాయి రాగం.

Janareddy: మాజీ మంత్రి జానారెడ్డి సన్నాయి రాగం.

తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడే మోపు మీదకు వచ్చిందని అనుకుంటే… మాజీ మంత్రి జానారెడ్డి మెల్లగా మొదలు పెట్టిండు సన్నాయి రాగం. అందరు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతానని… అందుకోసం అవసరమైతే తన కొడుకు రాజీనామా చేస్తే…అక్కడి నుంచి తాను పోటీ చేసి గెలుస్తానని సెలవిచ్చారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో జానారెడ్డి ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక గెలుపు తర్వాత కాంగ్రెస్ నేతలు ఒక్క తాటి మీదకు రావటం..పార్టీ గెలుపు కోసం ఢిల్లీ నాయకత్వం సూచనల మేరకు ఎన్నికల క్షేత్రంలో నిమగ్నమయ్యారు. కన్నడ నాట ఎన్నికల నాటికి తెలంగాణలో జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హనుమంత రావు ఎవరికీ తోచిన రీతిలో వారు ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు కొంత దారిలో పడ్డారు అనుకుంటే జానారెడ్డి అందుకున్నారు.

ఇటీవల టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా తన ఇద్దరు కొడుకులకు మునుగోడు, మిర్యాలగూడ స్థానాలు, తనకు నల్గొండ ఎంపి సీటు ఇవ్వాలన్నారు. ఈ విధంగా విలక్షణమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే జానారెడ్డి…ఆయన మాటల మర్మం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

జానారెడ్డి ప్రెస్ మీట్ అంటేనే జర్నలిస్టులు సతమతం అవుతారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టిన పది నిమిషాల వరకు లెక్క దొరకదు. అలాంటిది సిఎం పదవి విషయంలో ఇంత నేరుగా.. నేర్పుగా మాట్లాడటం మీడియాలో, పార్టీలో చర్చనీయాంశం అయింది.

గతంలో GHMC ఎన్నికల సమయంలో కూడా 5 రూపాయల భోజనం అద్భుతం అని కితాబిచ్చి కారు మీద పన్నీరు పోశారు. జానారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయని అప్పట్లో కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జానారెడ్డికి కెసిఆర్ తో లోపాయికారీ ఒప్పందం జరిగిందని గుసగుసలు వినిపించాయి.

ఉమ్మడి రాష్ట్రంలో 1994 శాసనసభ ఎన్నికల సమయంలో ఇదే టైపు వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన అభివృద్ధి పనులే  చలకుర్తి నియోజకవర్గంలో గెలిపిస్తాయని ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు స్వల్ప మెజారిటితో టిడిపి అభ్యర్థి గుండబోయిన రామూర్తి యాదవ్ గెలిచారు.

అప్పుడు చలకుర్తి…ఇప్పటి నాగార్జునసాగర్ నియోజవర్గాల్లో జానారెడ్డి పరపతి తిరుగులేనిది. నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పట్టున్న నాయకుడు. మంత్రిగా..శాసనసభ్యునిగా నియోజవర్గానికి, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించారు. నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఎంతో మంది యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారని ఇప్పటికీ చెపుతారు.

విపక్షంలో ఉన్నా అధికార పక్ష నేతలు సిఎంలతో ప్రశంసలు అందుకున్న అరుదైన నేతల్లో జానారెడ్డి ఒకరు. 1999 సంవత్సరం చివరలో చలకుర్తి నియోజకవర్గం దామరచర్ల మండలం ఈర్లపాలెం వచ్చిన సిఎం చంద్రబాబు.. అధికార పార్టీ నేతలను కాదని జానారెడ్డిని హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి తీసుకురావటం అప్పట్లో సంచలనం. తెలంగాణ అసెంబ్లీలో సిఎం కెసిఆర్… జానారెడ్డి ఏదైనా అంశాన్ని ప్రస్తావిస్తే గౌరవించేవారు.

జానారెడ్డి వ్యాఖ్యలు కాకతాలియమా? ఇంకా ఏమైనా ఉందా? పార్టీ గెలుపు అవకాశాలను ప్రతిపక్షాల కన్నా స్వపక్ష నేతలే దెబ్బతీయటం కాంగ్రెస్ లో మాములే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ లో… నేతలు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నా.. ఓటర్లు మాత్రం మొదటి నుంచి ఆదరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్