Saturday, November 23, 2024
HomeTrending NewsBRS -2: నడి బజారులో తెలంగాణ ఓటరు

BRS -2: నడి బజారులో తెలంగాణ ఓటరు

తెలంగాణ వచ్చాక కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో తప్పటడుగులు వేసిందని…స్వరాష్ట్రంలో ఉద్యోగాలు దక్కుతాయని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే ఎదురయ్యిందని అధికార పక్ష నేతలే మదనపడుతున్నారు.

నోటిఫికేషన్ల పేరుతో కోర్టు కేసులు తప్పితే ఒక్కటి సజావుగా పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో సిఎంగా కిరణ్ కుమార్ రెడ్డి హయంలో నీటిపారుదల శాఖలో సుమారు వెయ్యి పోస్టులు భర్తీ చేస్తే ఒక్క ఆరోపణ రాలేదు. ముడుపుల ముచ్చట…పైరవీలకు ఆస్కారం లేకుండా నిర్వహించారు.

మన తెలంగాణలో మన రాజ్యం అన్నట్టుగా TSPSC ఆడిందే ఆట పాడిందే పాట. సిఎం నుంచి మంత్రుల వరకు TSPSCకి వత్తాసు పలకటం ప్రజలు చూస్తున్నారని…స్వరాష్ట్రంలో నిరసనలు, ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెపుతారని విద్యార్ధి సంఘాలు హెచ్చరించాయి. విమర్శలు పెరగటంతో… ఎన్నికలు పూర్తి కాగానే ప్రక్షాళన చేస్తామని… ఎన్నికల వేళ మంత్రి కేటిఆర్ సెలవిచ్చారు.

రాష్ట్రంలో అడిగినోల్లకి…అడగనోల్లకి వరాలు ప్రకటించామని సిఎం చెపుతుంటారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా, కాకతీయ విద్యార్థులతో సమావేశం అయ్యేందుకు కెసిఆర్ కు తొమ్మిదన్నర ఏళ్ళలో తీరిక దొరకలేదని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధి సంఘాలు నిర్వీర్యం అయ్యాయి.

రైతుబందు మంచిదే అయినా..ప్రజాధనం పెత్తందారుల బొక్కసాలకే చేరుతోందని సామాన్య ప్రజలకు మెల్లగా అర్థం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టింది. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం నిజమైన సన్నకారు రైతుకే సాయం అందుతోంది. తెలంగాణలో వందల ఎకరాలు ఉన్న వారికి రైతుబందు అందించటం దేనికి సంకేతమని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కెసిఆర్ ప్రభుత్వం పరిమితి దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోవటం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

రాళ్ళు రప్పలతో నిండిన గుట్టలకు, చెరువులో నీటి మట్టం పెరిగితే మునిగే శిఖం భూములకు రైతు బంధు సాయం అందిస్తున్నారు. ఆదాయపన్ను మినహాయింపు కోసం కొనుగోలు చేసిన కొండలు, గుట్టలకు రైతు బంధు వస్తోంది. బ్లాక్ మనీ అధికారికంగా వైట్ మనీ అవుతోంది. నిబంధనలతో సంబంధం లేకుండా రైతు బంధు ఇస్తున్నారు…వందల కోట్లు భూస్వాముల ఇళ్ళలోకి చేరుతోంది. పేదలకు ఇచ్చే రేషన్ కార్డు జారీకి లెక్కలేని రూల్స్…ఎప్పుడు జారీ చేస్తారో అని ఎదురుచూపులు.

ల్యాండ్ ప్యురీఫికేషన్… సాదా బైనామా… ధరణి…పోడు భూములకు పట్టాలు…ఇవన్నీ అంతర్గతంగా  ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ధరణి పేరుతో జరుగుతున్న అక్రమాలు అంతా ఇంత కాదని విపక్షాలు మండిపడుతున్నాయి. ధరణి పేరుతో గ్రామాల్లో భూములు మళ్ళీ పెత్తందారుల చేతుల్లోకి వెళ్లాయని క్షేత్ర స్థాయి నివేదికలు చెపుతున్నాయి. ప్రతి వారం ప్రాజావానికి వచ్చే ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం అంటున్నారు.

దశాబ్దాల క్రితం తీసుకున్న భూములకు సరైన పత్రాలు లేక సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పహనీల్లో యజమానుల పేర్లు ఉండగా.. సామాన్యులు సాగు చేసుకుంటున్నారు. ఇలాంటి భూములలో అక్రమాలు జరిగాయి. ధరణి వస్తే లంచగొండితనం ఉండదని సిఎం కెసిఆర్ ఎప్పుడు చెపుతుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ధరణి రద్దు చేయకుండా సవరణలు చేస్తే భవిష్యత్తులో సత్పలితాలు ఇస్తుందని నిపుణులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్