Saturday, November 23, 2024
HomeTrending NewsYS Jagan: సింహం సింగిల్ గానే వస్తుంది: జగన్

YS Jagan: సింహం సింగిల్ గానే వస్తుంది: జగన్

సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా మాత్రమే కాకుండా ఒక విధానంగా పాటిస్తున్న ప్రభుత్వం తమదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ సంబోధిస్తూ, నిరుపేదలుగా ఉన్న వారిని అక్కున చేర్చుకొని  53 నెలల పాలనా కాలంలో వారికి సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలిగామని వెల్లడించారు. తాము చేస్తున్న ప్రతి పనిలో ఈ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, కానీ గతంలో చంద్రబాబు నాయుడు ఆయన  సొంత సామాజికవర్గం కోసమే పనిచేశారని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా 20,24,709 మంది పేదలకు లబ్ధి చేకూరుస్తూ.. ఇప్పటికే వారు సాగు చేసుకుంటున్న  భూములపై సర్వ హక్కులూ కల్పిస్తూ 35,44,866 ఎకరాలను ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన ఓ కార్యక్రమంలో సిఎం జగన్ లబ్దిదారులకు భూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు.

“సామాజిక న్యాయం అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పేదల కోసం పేద కులాల కోసం పేద వర్గాల కోసం ఆలోచించడం. గత ముఖ్యమంత్రిలా తన వర్గం, తన వాళ్ల కోసం, తన గజదొంగల ముఠా కోసం పేదల ప్రయోజనాలను తాకట్టు పెడితే జరిగేది సామాజిక న్యాయం కాదు.. అది సామాజిక అన్యాయం అవుతుంది” అని పేర్కొన్నారు.

చంద్రబాబు ఏనాడూ ప్రజలకు మంచి చేసి సీఎం కూర్చీలో కూర్చోలేదని… మొదటిసారి  పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి సిఎం అయ్యారని; రెండో సారి కార్గిల్ పుణ్యమా అని; మూడోసారి రైతులకు, మహిళా సంఘాలకు, యువకులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలు ఇచ్చి సిఎం అయ్యారని దుయ్యబట్టారు. అందుకే గత ఎన్నికల్లో బాబుకు గూబ గుయ్ మనిపించేవిధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చే హామీలపై నిబద్ధత లేని నాయకుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. ఆయన గత పాలనను ఎవరూ మర్చిపోవద్దని, ఎలా అన్ని వర్గాలనూ మోసం చేశారో, బిసిల తోకలు కత్తిరిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తోడేళ్ళ మంద ఒక్కటవుతోందని, బాబు ఇస్తున్న మోసపూరిత వాగ్దానాలు, అబద్ధాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని, తన పొత్తు ప్రజలతోనేనని, తోడేళ్ళ మంద గుంపులుగా వచ్చినా తాము సింగంలా సింగిల్ గానే వచ్చిందని, తనకు ఈ ధైర్యం ప్రజలు ఇచ్చిందేనని తేల్చి చెప్పారు. ఇంకా మంచి చేసేందుకు తనకు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్