ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు రాష్రానికి దిక్సూచిగా నిలవాలన్నది సీఎం జగన్ సంకల్పమని, బడుగుల రాజ్యంగా రాష్ట్రాన్ని నిలుపుతున్నారని ఎంపి నందిగం సురేష్ స్పష్టం చేశారు. దళిత మహిళలను హోమ్ మంత్రి చేయడంతో పాటుగా ఐదు మంత్రి పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చారని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంటే, జగన్ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. సామాజిక సాధికార బస్సుయాత్ర పెందుర్తి నియోజకవర్గంలో అశేష జనవాహిని మధ్య జరిగింది. సబ్బవరం జంక్షన్ లో స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఎంపీలు నందిగం సురేశ్, బీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరయ్యారు.
ఎంపి సురేష్ మాట్లాడుతూ జగన్ చేస్తున్న పాలనను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని, వెనుకబడినవర్గాలపై ఆయన పెత్తనంచేస్తే, జగన్ మాత్రం చేయూతనిచ్చి అండగా నిలుస్తున్నారన్నారని పేర్కొన్నారు. బాబు పాలనలో రాష్ట్రంలో పేదరికం 12 శాతం ఉండగా, ఇవాళ 5 శాతానికి తగ్గిందంటే దానికి కారణం జగన్ పాలన మాత్రమేనని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క శాతమైనా పేదరికం ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. పేదల ఆకలి, కష్టం తెలిసిన నేత జగన్ అని, ఒక తరం కాదు ఒక చరిత్ర సాగాలాంటే మరోసారి జగన్ సిఎం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ, పాదయాత్ర సమయంలో సీఎం ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చారని వెల్లడించారు. గతంలో ఐదేళ్లు సీఎంగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే అనేక సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం పేరైనా సరే గుర్తుకు వస్తుందా అని అదీప్ రాజు ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం మేలు చేసి అండదండలు పేదలకు ఇస్తుందో ఆలోచించాలని కోరారు.
తునిలో….
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలన సాగిస్తోందని, తాము తెచ్చిన సంస్కరణల వల్ల ఎన్నడో నిస్పృహలో పడిన వర్గాలు, జీవితంలో మార్పు రాదనుకున్న వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఓటు వేయని వారికి కూడా సంక్షేమం అందిందని, నావాడు అధికారంలో లేడు కాబట్టి తలవంచుకొని ఉండాలనే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తుని నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ఘనంగా జరిగింది. రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జక్కంపూడి రాజా, జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
ధర్మాన మాట్లాడిన ఇతర ముఖ్యాంశాలు:
* ఎవరికీ నయాపైసా లంచం ఇవ్వకుండా సంక్షేమం అందే స్థితిని తీసుకురాగలిగాం.
* ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతినకుండా సంక్షేమం అందిస్తున్నాం
* గతంలో గ్రామాల్లో జన్మభూమి కార్యకర్తలను పెట్టి వారి గుప్పెట్లోనే పథకాలు పెట్టారు.
* కలెక్టర్ దగ్గరకెళ్లినా జన్మభూమి కమిటీలవద్దకే వెళ్లాలనే దుస్థితి ఉండేది.
* కానీ ఇప్పుడు ఎవరూ ఎవరి వద్దా తలవంచి దండం పెట్టాల్సిన అవసరం లేదు.
* అభివృద్ధి, సంక్షేమం అందుకోవడంలో ఓ గౌరవం ఉంది. ఇది ఇతర రాష్ట్రాల్లో లేదు.
* ఎవరూ ఉద్యమాలు చేయకుండానే సంస్కరణలు అమలు చేస్తున్నాం.
* ప్రయివేటు వ్యక్తుల వద్ద నుంచి రూ.12,800 కోట్లు పెట్టి భూమిని కొని 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ఇలా పేదల కోసం చంద్రబాబు ఏనాడూ చెయ్యలేదు.
* 100 సంవత్సరాల కిందట బ్రిటీష్ వారు చేసిన సర్వేమీదే భూమి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి రీసర్వే చేస్తున్నాం.
* అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
* మరో 20 ఏళ్లు ఈ ప్రభుత్వం కొనసాగితే సమాజంలో చాలా మార్పు వస్తుంది.
మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడిన ముఖ్యాంశాలు:
* బడుగు, బలహీన వర్గాలు జగనన్నను గుండెల్లో పెట్టుకుంటున్నాయి.
* రాష్ట్రంలో ఉన్న 70–80 శాతం బడుగు బలహీనవర్గాలకు మా ప్రభుత్వంలో న్యాయం జరిగింది.
* చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా వెలగబెట్టి ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.
* ఆ పదవులు డబ్బులకు అమ్ముకున్నాడు.
* అదే జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు.
* రూ.1,735 కోట్లు తుని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి డీబీటీ ద్వారా అందజేశారు.
* నాలుగు సంవత్సరాల్లో 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందించారు.
* ఇందులో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే.