Friday, November 22, 2024
HomeTrending NewsHate on Hatric: మూడో దఫా బ్యాచ్ తో ముప్పు

Hate on Hatric: మూడో దఫా బ్యాచ్ తో ముప్పు

ఎన్నికల ప్రచారం దగ్గ్గర పడుతున్న వేళ ఓటర్ల వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా జరుగుతున్న ఎన్నికలు ఓ కొత్త కోణానికి తెరలేపాయి. మూడో దఫా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రభుత్వ ఉనికికి ముప్పుగా పరిణమించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి మూడు అంతకన్నా ఎక్కువసార్లు పోటీ చేస్తున్న వారికి మళ్ళీ ఓటు వేసేందుకు ఓటర్లు విముఖత చూపెడుతున్నారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టినా అధికార పార్టీ నేతలు కిమ్మనకుండా ఉండటం…పైగా గుడ్డిగా సమర్థిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైతు బంధు పథకానికి మొదట్లో బ్రహ్మరథం పట్టిన రైతాంగం ఇప్పుడు దాని లోగోట్టుపై విశ్లేషణలు చేస్తున్నారు. 90 శాతం రైతులకు పది ఎకరాల లోపు ఉండగా కేవలం పది శాతం భూస్వాములకు వందల ఎకరాల వరకు ఉంది. రైతుబందుకు ఓ స్లాబ్ అనేది లేకుండా అందరికి వర్తింప చేయటం సిఎం కెసిఆర్ నిర్ణయం పట్ల అనుమానాలకు తెరలేపింది. వందల కోట్ల ప్రజాధనం కేవలం పది శాతం బడా భూస్వాములకు తరలివెళుతోందని రైతాంగం చర్చించుకుంటున్నారు.

ఐదేళ్ళు గడిచినా రైతుబందు పథకానికి నిబంధన లేకపోగా…రైతుబంధు పుట్టించినదే కెసిఆర్ అని ప్రచార సభల్లో గులాబీ అధినేత చెప్పుకోవటం ప్రతికూలంగా మారుతోంది. కేంద్రం మాదిరిగా రాష్ట్రంలో నిబంధన అనేది లేకపోవటం దారుణమని… వరుసగా గెలుస్తున్న ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఏమి ఎరుగనట్టు వ్యవహరించటం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. సిఎం ను కలవలేని వీరిని మూడో దఫా గెలిపించినా ఏం ప్రయోజనమని యువత విముఖతతో ఉంది.

తెలంగాణ వచ్చిన మొదటి ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల మీద నిఘా, కట్టడి అధికంగా ఉండిందని, రెండో దఫా గెలిచాక వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా నియోజకవర్గాలు తయారయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. అడవి పక్కన ఉన్నవారు అడవులు ఆక్రమించుకోవటం, చెరువులు కబ్జా చేయటం, ఇసుక రీచ్ లు, మైనింగ్ నుంచి రాజధానిలో GHMC అనుమతుల వరకు ఏలుబడిలో ఉన్న పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మునుపు ఎన్నడు లేని రీతిలో ప్రభుత్వ భూములకు రెక్కలు వచ్చాయి. గ్రామాలు, పట్టణాల నుంచి రాజధాని వరకు వాణిజ్య విలువ ఉన్న భూములు అన్యాక్రాంతం అయ్యాయి. భూలావాదేవీల్లో ఎవరు ఉన్నారనేది జగమెరిగిన సత్యం. అభివృద్ధి పేరుతో అక్రమాలు జరుగుతుంటే.. కంచే చేను మేసినట్టుగా…ప్రజలు దిక్కు తోచని స్థితిలోకి చేరుకున్నారు. రెండు దఫాలు గెలిచి మూడో దఫా రంగంలో ఉన్న అధికార పార్టీ నేతలపై ఈ వ్యవహారంలో ఆరోపణలు కోకొల్లలు.

దళిత బంధు పథకం ప్రభుత్వానికి కావలసినంత చెడ్డ పేరు తీసుకోచ్చిందనే వార్తాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 70 శాతం లబ్దిదారులు అధికార పార్టీ నేతలకు అనుచరులని నివేదికలు చెపుతున్నాయి. పథకం అందని వారు ఈ విమర్శలు చేస్తుంటే..వచ్చిన వారు కూడా విమర్శలు చేయటం విడ్డూరం. తమకు దక్కిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఎమ్మెల్యేకు చెందిన వారే తీసుకున్నారని లబ్దిదారులు మండిపడుతున్నారు.

నిరుద్యోగుల అసంతృప్తి జ్వాలలు అన్ని వర్గాలను తాకాయి. తెలంగాణ వచ్చాక చిన్నా చితకా ఉద్యోగాలు, పోలీసు శాఖలో భర్తీ జరిగిన మాట వాస్తవం. ఉన్నత విద్యావంతులు ఆశపెట్టుకున్న గ్రూప్-1,2 ఉద్యోగాల భర్తీ ప్రహసనంగా మారటం…TSPSCలో కీలక బాధ్యతల్లో ఉన్న వారిపై చర్యలు తీసుకోకపోవటం సామాన్య ప్రజలను కూడా నివ్వెర పరిచింది. ఎన్నికల ప్రచారం జోరు మీదకు వచ్చాక బోర్డును ప్రక్షాళన చేస్తామని చెప్పటం అసంతృప్తికి ఆజ్యం పోసినట్టు అవుతోంది.

విచ్చలవిడిగా పెరిగిన మద్యం షాపులు, వినియోగం మహిళా లోకాన్ని కలవరపరుస్తోంది. రెండు సార్లు అవకాశం ఇచ్చాం ఇక చాలు అని మహిళలు ముఖం మీదే చెపుతున్నారు. మూడో దఫా ఓటు కోసం వెళుతున్న అధికార పార్టీ నేతలకు కొన్ని ప్రాంతాల్లో నిరసనలు ఎదురయ్యాయి. ఓటు వేయకపోతే ఏమి చేస్తామో… మా సంగతి చూపెడుతామని బెదిరింపులు ఓటర్లను పునరాలోచనలో పడేస్తున్నాయి.

వరుసగా గెలుస్తున్న మంత్రులు…మూడో దఫా..హట్రిక్ కొడుతారు అనుకున్న మంత్రుల పరిస్థితి క్షేత్ర స్థాయిలో విభిన్నంగా ఉందని… పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ తారుమారు అవుతోందని వార్తలు వస్తున్నాయి. మూడో దఫా బరిలో ఉన్న ఎమ్మెల్యేలపై అధిక శాతం ప్రజల్లో అసంతృప్తి ఉంది. తిరిగి వాళ్ళకే టికెట్ ఇవ్వటం…వారిపై ఉన్న వ్యతిరేకత పక్క నియోజకవర్గాలకు వ్యాపించి..రాష్ట్ర వ్యాప్తంగా తుపానులా మారుతోందని అంతర్గత నివేదికల కథనం. రిజర్వుడు స్థానాల్లో పోటీ చేస్తున్న పాలకపక్షం నేతల్లో ఒకరిద్దరు మినహా అందరికి భంగపాటు తప్పదని తేటతెల్లం అవుతోంది.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న..చూసిన…తరాలు ఇంకా మిగిలి ఉన్నాయనే విషయాన్నే అధికార పార్టీ నేతలు మరచిపోయినట్టు అనిపిస్తోంది. రజాకార్ల నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలది…డబ్బుతో దారిలోకి రారనే చిన్న లాజిక్…మూడో దఫా ప్రజల్లోకి వెళుతున్న నేతలు మరచినట్టున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకుల వద్ద డబ్బులు తీసుకుని ఉద్యమకారులకు వేసినట్టుగా ఇప్పుడు అదే రివర్స్ లో జరగబోతోందని…ఎన్నికల సరళి చూస్తే అవగతం అవుతోంది.

తెలంగాణ ప్రజలు ఆధిపత్యాన్ని అంగీకరించరనే విషయాన్ని పాలకులు విస్మరించారు. పాలనలో మితిమీరిన జోక్యం…ఆధిపత్యం..ముచ్చటగా మూడో సారి ఓట్ల కోసం వెళుతున్న నేతలను ప్రజలకు దూరం చేశాయి. మూడో దఫా బ్యాచ్ తో మరో ముప్పు మొదలైంది. ఉదాహరణకు మధిరలో మూడో దఫా పోటీ చేస్తున్న కారు అభ్యర్థి కమల్ రాజ్ లాంటి నేతలకు సానుబూతి ఉన్నా ఓట్ల రూపంలోకి ఎంత వరకు వస్తుందో చూడాలి. అధికార పార్టీ వైఫల్యాలపై…నిర్మాణాత్మక రీతిలో ఉద్యమాలు చేయకపోయినా కాంగ్రెస్ నెత్తిన పాలు పోసే రోజు పాలకులే కల్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పోలింగ్ నాటికి ఏదైనా అద్భుతం జరిగితే తప్పా హట్రిక్ బ్యాచ్ కు తిప్పలు తప్పవని అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్