తెలంగాణ ఎన్నికలు నోటిఫికేషన్ రోజు నుంచి పోలింగ్ నాటికి సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల నుంచి అగ్రనేతలు ప్రచారానికి రావటంతో చివరి రోజులు ఓటరును సతమతం చేశాయి. అటు బీఎస్పి అధినేత్రి మాయావతి రెండు, మూడు ప్రాంతాల్లో ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ నుంచి అధినేత కెసిఆర్ మంత్రులు కేటిఆర్, హరీష్ రావులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు చుట్టేశారు. ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, లోకసభ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల్లో మకాం వేశారు. సిఎం కెసిఆర్ రోజుకు మూడు నియోజక వర్గాల్లో ప్రచారం చేసి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నా.. అభివృద్ధి కార్యక్రమాలు గట్టేక్కిస్తాయని గులాబీ నేతలు ధీమాతో ఉన్నారు. మంత్రి కేటిఆర్ అటు ప్రచారం నిర్వహిస్తూ…మేధావులు, వివిధ రంగాల ప్రతినిధులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ విధానాలు వివరించారు. మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. కొన్ని స్థానాలు తగ్గినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని…కారుకు ఎదురు లేదని నేతలు నిశ్చింతగా ఉన్నారు.
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, ఉత్తర తెలంగాణలో గణనీయంగా సీట్లు సాధిస్తామని హస్తం నేతలు భరోసాతో ఉన్నారు. అంతర్గత సర్వేలు చేయించుకున్న కాంగ్రెస్ పెద్దలు స్పష్టమైన మెజారిటీ వస్తుందని.. అయినా సరే ఏ అవకాశాన్ని చేజార్చకూడదని పోరాటం చేస్తున్నారు. అగ్రనేతలు రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీల సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కోడంగల్, కామారెడ్డి వెళ్లి వస్తూనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అగ్రనేతల ప్రచారం ఓట్ల రూపంలోకి మారినట్టే అని గాంధీ భవన్ లో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా ప్రచారానికి పార్టీ అధినేత్రి సోనియా గాంధి రాలేదు. ఈ నేపథ్యంలో సోనియా గాంధి ఓటర్లను అభ్యర్థించే వీడియోను పార్టీ చివరి రోజు విడుదల చేసింది.
చివరి వారం రోజులు బిజెపి అగ్రనేతల రాకతో కమలదళంలో జోష్ వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో బిజెపి హవా కనిపిస్తోందని విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా అగ్రనేతలు కుటుంబ పాలన…వారసత్వ రాజకీయాల పైనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కమల వికాసానికి అవకాశం ఉన్న నియోజకవర్గాలకు అగ్రనేతలు వెళ్ళటంతో చాలా ప్రాంతాల్లో ద్విముఖ నుంచి త్రిముఖ పోటీగా మారింది. 2018తో పోలిస్తే ఈ దఫా బిజెపి అగ్రనేతల సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలకు ప్రతిపలం దక్కుతుందని కమలనాథులు నిబ్బరంగా ఉన్నారు.
బిఎస్పి నుంచి పార్టీ అధినేత్రి మాయావతి సూర్యాపేట, పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రధాన పార్టీలను ఏనుగు ప్రచారం కలవరపెడుతోంది. సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పోటీ చేయటంతో పోటీ రసవత్తరంగా మారింది. పటాన్ చెరువు బిఎస్పి అభ్యర్థి ప్రధాన పార్టీలకు పక్కలో బల్లెంలా మారారు. సిర్పూర్, పెద్దపల్లి, సూర్యాపేట, పటాన్ చెరువుల్లో విజయం సాధిస్తామని పార్టీ నేతల అంచనా.
మజ్లీస్ అగ్రనేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసి పాతనగరంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఏడు సీట్లను కాపాడుకోవటం…అదనంగా జుబ్లీహిల్ల్స్ లో పతంగి ఎగురవేయాలని పావులు కదుపుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సమాచారం. యాకుత్ పురాలో ఎంబిటి… చార్మినార్, నాంపల్లి, మలక్ పేటలో కాంగ్రెస్ నుంచి మజ్లీస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
మొదట్లో విజయానికి ఎదురు లేదని భావించిన నియోజకవర్గాల్లో ముగింపు దశకు చేరుకునే సమయానికి పోటీ తీవ్రం అయింది. జిల్లాకు రెండు మూడు ప్రాంతాల్లో అధికార, విపక్షాల మధ్య పోటీ పెరిగి ఎవరు గెలుస్తారని చెప్పలేని స్థితి నెలకొంది. రాష్ట్రంలో ఈ దఫా సుమారు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో కేవలం రెండు, మూడు వేల ఓట్ల తేడాతోనే అధికార, విపక్ష అభ్యర్థులను విజయం వరిస్తుందని సర్వేలు చెపుతున్నాయి. ఈ దఫా తెలంగాణ శాసనసభలో బహుళ పార్టీల ప్రాతినిధ్యం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
-దేశవేని భాస్కర్