జగన్ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలంతా కలిసిరావాలని, కేసులు పెడతారని భయపడి బైటకు రాకపోతే మనకు మనం మరణశాసనం రాసుకున్నట్లేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పేదరికంలేని సమాజాన్ని చూడడం, తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్ వన్ గా ఉంచాలన్నదే తన జీవిత ఆశయమని, దానికోసం ఈ నలభై ఏళ్ళలో ఎంత కష్టపడ్డానో రాబోయే కాలంలో అంతకన్నా ఎక్కువ పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. రాబోయే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని, టిడిపి-జనసేన కూటమిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా..రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా ఆలోచింఛి అందరూ ముక్తకంఠంతో ముందుకు రావాలని… తాను అందరివాడిని తప్ప ఏ ఒక్కరివాడినో కాదని, పేదవాడు ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని స్పష్టంచేశారు. తనకు ఓ విజన్, స్పష్టత, ఆశయం, ధ్యేయం ఉన్నాయన్నారు. సిఎం జగన్ పుట్టినరోజు అయితే ప్రజల డబ్బుతో పత్రికలకు ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
తాను సూపర్ సిక్స్ ప్రవేశపెట్టి మహాశక్తి పథకం ప్రకటించానని, అయితే ఓడిపోతామనే భయంతో తాను కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇస్తానని జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని, జగన్ నే మార్చాలని చెప్పారు. త్వరలో తాను ప్రజల వద్దకు వస్తానని, రాబోయే ఐదేళ్ళలో ఏమి చేయబోతున్నమో చెబుతానని, అందరిలో చైతన్యం తీసుకు వస్తానని వెల్లడించారు.