ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు-2022 ఉత్సాహభరిత వాతావరణంలోజరుగుతున్నాయి. నేడు రెండో రోజు ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా రెండు నాటకాలు, మూడు నాటికలు ప్రదర్శితమయ్యాయి. ఇవన్నీ వినోదంతో పాటు విఙ్ఞానాన్ని పంచుటూ జనరంజకంగా సాగాయి. సురభి వారి రంగాలంకరణలు వీటికి మరింత వన్నె తెచ్చాయి. నాటక సమాజాలు క్రమశిక్షణతో, చూపరుల మనసులను ఆకట్టుకుంటూ సందేశాలను నేరుగా ప్రేక్షక హృదయాలకు చేరేలా ప్రదర్శనలుం ఇస్తుండడంతో ప్రేక్షకులు ఏకాగ్రతతో తిలకిస్తున్నారు.
నేడు మొదటగా డా. పి.వి.ఎన్.కృష్ణ రచన-దర్శకత్వంలో శ్రీ మాధవర్మ (పద్య నాటకం) ప్రదర్శితమైంది. ఇది భక్తుల కొంగుబంగారంగా ప్రసిద్ధికెక్కిన విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర కావటంతో అందరూ ఎంతో ఆసక్తిగా చూసి ఆనందించారు. వేదాలలో, దేవిభాగవతంలోనూ దుర్గాదేవిగా కొనియాడబడిన అమ్మవారు. విజయవాడలో కనకదుర్గమ్మగా పిలవబడటానికి కారణం ఈ నాటక ప్రధాన ఇతివృత్తం.
బాధ్యత (బాలల నాటిక) రెండో ప్రదర్శనగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పర్యాకరణ పరిరక్షణ నేపధ్యంలో చిచ్చరపిడుగుల్లాంటి బాలలు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. స్వార్ధంతో చెట్లను నరకటం మంచిదికాదన్న సందేశాన్ని ఆముదాల సుబ్రహ్మణ్యం స్వయంగా రచించి దర్శకత్వం వహించిన నాటిక చెప్పగలిగింది.
మూడో ప్రదర్శన ‘కలనేత’ (సాంఘిక నాటకం) నేతన్నల జీవితాల నేపధ్యంలో కుంటుంబాల నడుమ బంధాలు, అనుబంధాల విలువలను యువత ఆలోచిస్తూ ముందడుగేస్తున్న తీరును చూపించింది. ఇది రెండు కుటుంబాల కథ – ఇద్దరు బట్టలు నేసే నేతగాళ్లు. అందులో ఒక కుటుంబం కులవృత్తినే నమ్ముకొని బీదరికంలో మగ్గుతుంటారు. ఇంకొక కుటుంబం మగ్గాలు మూలకుపడేసి వేరే విధంగా ధనవంతులవుతారు. ఆ తారతమ్యాల వల్ల రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలొస్తాయి. వాటి పర్యవసానం చిన్నప్పటి నుండి భార్యా…భర్తలవుతారనుకున్న ఆ రెండు కుటుంబాల పిల్లలు దూరం కావలసి వస్తుంది. మళ్లీ ఆరెండు కుటుంబాలు ఒకటవ్వటానికి యువ జంట పడ్డ ఆరాటాన్ని నాటిక ఆవిష్కరించింది. ఆకెళ్ల రచనకు బీఎం రెడ్డి దర్శకత్వం వహించారు. చైతన్యకళాభారతి,
‘చీకటిపువ్వు’ నాటిక చక్కని సందేశాన్ని అందించింది. పరిస్థితులకు ఏ ఒక్కరూ అతీతంకాదని, అవసరంతోనో.. అవకాశంలేకో చాలామంది జీవితంలో తప్పులు చెయ్యడం సహజం. కానీ చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తపడిన తర్వాత కూడా అలాంటి వారిని దూరం పెట్టకూడదని సందేశాత్మకంగా నాటకం సాగింది. క్షమించి వాళ్ళని దగ్గరికి తియ్యకపోతే పరిస్థితులు విషమిస్తే తరువాత ఏమనుకున్నా ప్రయోజనం వుండదని నాటకం తెలియజెప్పింది. మూలకధ పీఎస్. నారాయణది, నాటకీకరణ, రచన: పరమాత్ముని శివరాం ,దర్శకత్వం రమేష్ మంచాల.
ఆదర్శవంత ప్రదర్శన ఉద్ధమ్ సింగ్: స్వాతంత్ర్య సంగ్రామంలో ఆనాటి యువత దేశభక్తితో భరతమాత బానిస సంకెళ్లు తెంచడానికి పోరాటం చేసిన ఎందరో వీరులు ఎందరో వున్నారు. అలాంటి వారిలో ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్దంసింగ్ ఆదర్శ జీవితాన్ని నాటిక చక్కగా చూపించగలిగింది ‘జలియన్ వాలాబాగ్’ దుర్ఘటనలో అమరవీరుల బలిదానాల సాక్షిగా బ్రిటీషు అధికారిపై పోరాటంచేసిన ఉద్దంసింగ్ జీవితాన్ని ప్రేక్షకులు నాటికలో చూడగలిగారు. ఈ నాటికకు కథ, మాటలు, దర్శకత్వాన్ని డా.పి.వివేక్ అందించారు.
‘త్రిజుడు’ సాంఘిక నాటిక సందేశంతో పాటు ప్రేక్షకుల మదిలో ఆలోచనలను రేకెత్తించి కుల వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన నాటిక. మూలకధ పి.వి.వి. సత్యనారాయణ. నాటకీకరణ యల్లాప్రగడ భాస్కరరావు అందించారు. వై.యస్. కృష్ణేశ్వరరావు దర్శకత్వంలో నాటిక చక్కగా ప్రదర్శితమయింది. కులం, మతం, పుట్టుక, డబ్బు ఇవేవీ మనిషి మంచితనానికి గీటురాళ్లు కాదు. ఒక్క మానవత్వం మాత్రమే మనిషిని మనిషిగా ప్రపంచానికి చూపెడుతుందన్న సత్యాన్ని నాటిక ద్వారా ప్రేక్షకులు అందుకున్నారు.
‘గమ్యస్థానాల వైపు’ నాటికలో సందేశం ప్రేక్షకుల హృదయాలకు చక్కగా అందింది. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఎదిరించి ముందుకెళ్ళాలి. నిరాశా నిస్పృహలతో జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. మన ప్రాణాన్ని మనమే చంపుకుంటే అది ఆత్మహత్య అవ్వదు, హత్యగానే పరిగణించబడుతుంది. అనే సందేశాన్ని నాటిక ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులు అందుకున్నారు.