Friday, October 18, 2024
HomeTrending NewsBRS: పాత కాపులతో ఓట్లు రాలుతాయా?

BRS: పాత కాపులతో ఓట్లు రాలుతాయా?

వేసవి కాలం దృష్ట్యా ఫిబ్రవరిలోనే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఢిల్లీ వర్గాల్లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ శ్రేణులను లోకసభ ఎన్నికలకు సిద్దం చేసే దిశగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నాయకత్వం సిద్దమైంది.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాల‌ని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌ను బీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశించారు. చేవెళ్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో ఈ రోజు (25 డిసెంబర్) కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. జ‌న‌వ‌రి 26వ తేదీలోగా స‌మావేశాలు పూర్తి చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.

చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌మ‌ని కేటీఆర్ చెప్పారని స‌మీక్ష అనంత‌రం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంద‌ని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాన్ని తిప్పికొడతామని, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మితో కుంగిపోవ‌ద్ద‌ని, ప‌రాజ‌యం చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల‌ని, వారు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించాల‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఓటమి కుంగుబాటులో ఉన్న నేతలు ఎంతవరకు ప్రజల్లోకి వెళతారో చూడాలి. ఓడిపోయిన వారే ఇంచార్జ్ లని చెపుతున్నా వారిని ప్రజలు ఆదరిస్తారా అని ఎంపి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్మూర్, చెన్నూర్ మహబూబ్ నగర్, అచ్చంపేట మొదలైన నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. భూకబ్జాలు, కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం వేదించటం, అధికారులతో అహంకార ధోరణిలో వ్యవహరించారని బహిరంగ విమర్శలు వచ్చాయి. అదే అభ్యర్థులు ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో ఓట్ల కోసం వెళితే పార్టీకి మేలు జరుగుతుందా అని గులాబీ నేతల్లో గుస గుసలు మొదలయ్యాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చి నాయకత్వం తప్పు చేసిందని, ఇప్పుడు అదే నేతలకు నియోజకవర్గ ఇంచార్జులుగా బాధ్యతలు అప్పచెపితే శాసనసభ ఫలితాలే పునరావృతం అవుతాయనే టాక్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొద్ది రోజులే కావటంతో… దాని ప్రభావం ప్రజల్లో ఇంకా ఉందని నేతలు అంటున్నారు. నియోజకవర్గ బాధ్యులను మారిస్తేనే పార్టీకి మేలు జరుగుతుందని లోకసభ అభ్యర్థులతో ద్వితీయ శ్రేణి నాయకులు చర్చిస్తున్నారు.

ఇప్పుడే నియోజకవర్గాల బాధ్యతల నుంచి పాత వారిని మారిస్తే పార్టీలో ముసలం మొదలవుతుందని, అది ఎటు నుంచి పోయి ఏమి జరుగుతుందో అని బీఆర్ఎస్ నాయకత్వం సందిగ్దంలో పడిందని తెలంగాణ భవన్ వర్గాలు చెపుతున్నాయి. పాత కాపులతో ఓట్లు వస్తాయా… ఈ పరిస్థితి నాయకత్వానికి విన్నవించకపోతే, తమ జాతక చక్రం ఏమవుతుందో అని కొందరు లోకసభ ఆశావాహ నేతలు మదనపడుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్