ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూశామని, కానీ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండమని, ప్యాకేజీల కోసం చివరకు తన సొంత పార్టీ వారిని కూడా త్యాగం చేసే ఈ త్యాగాల త్యాగరాజును చూస్తున్నామంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఏ భార్యతోనూ మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేని ఆయన పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందేనని ఏకంగా తన క్యాడర్ కు చెబుతున్నాడు’ అంటూ ఎద్దేవా చేశారు.
జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై సిఎం జగన్ నిప్పులు చెరిగారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
* ఒక్క విద్యా రంగంలోనే 55 నెలల కాలంలో ఖర్చు చేసింది అక్షరాలా 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా.
* ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోంది.
* ఈ మార్పుల్లో ఏ ఒక్కటీ చేయడానికి ఏనాడూ గతంలో ఎప్పుడూ ఎవరూ ఆలోచన చేయలేదు.
* నాకన్నా ముందు పరిపాలన చేసిన చంద్రబాబు పాలనను గుర్తు తెచ్చుకోండి.
* ఆ పెద్ద మనిషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు సీఎంగా పని చేశాడు.
* ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదు.
* కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించాడు.
* వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్టచతుష్టయానికి బిస్కెట్ల వేసినట్లు వేశాడు.
* దుష్ట చతుష్టయానికి చెందిన ఈ గ్యాంగ్, ముఠాలో ఇదే భీమవరంలో ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలుపెడతా.
* పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ మన రాష్ట్రంలో ఉండదు. నాన్ లోకల్.
* పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండడు.
* ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదని చెబుతాడు.
* తన విధానం నచ్చనివారు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని ఉపన్యాసాలు ఇచ్చే వాడిని ఎవరినీ చూసి ఉండం.. ఈయనను తప్ప.
* దత్తపుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటూ ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభూ అనే త్యాగాల త్యాగరాజునుమాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం.
* ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండం.
* ప్యాకేజీల కోసం తన వారిని త్యాగం చేసే ఈ త్యాగాల త్యాగరాజునే చూస్తున్నాం.
* రియల్ లైఫ్ లో ఈ పెద్దమనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా మూడు నాలుగు సంవత్సరాలైనా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజీ స్టార్.
* ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంట గలుపుతూ నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులిచ్చేయడం.
* ఏకంగా కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అంటే ఆలోచన చేయమని అడుగుతున్నా.
* నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మనకు చెల్లెళ్లు ఉన్నారు. మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు.
* ఇలాంటి వారు నాయకులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, ఇలాంటి వారిని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడూ చేయడం మొదలు పెడితే మన ఆడ బిడ్డల పరిస్థితి ఏమిటి? మన చెల్లెళ్ల పరిస్థితి ఏమిటి?
* ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే వారిని సమాజంలో, రాజకీయాల్లో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా?
* ఇలాంటి ఆయన ఏ భార్యతోనూ మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేడు.
* పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందేనని ఏకంగా తన క్యాడర్ కు చెబుతున్నాడు.
* నేను అడుగుతున్నా. ఆలోచన చేయమని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా?
* నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు గానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా?
* ఒకరేమో పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తూ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది.
* ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్నిమోసం చేస్తారు.
* ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తున్న చంద్రబాబు, ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడుతున్న ఈ దత్తపుత్రుడు.
* వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబం అయినా, పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా? ఎదగగలుగుతుందా?
* ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా?
* ఇలాంటి వారిబుద్ధిని చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా?
* ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపేగానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా? విశ్వదాభిరామ, వినుమవేమ అని వేమన స్వామి మాట్లాడారు.
* వీరి బుద్ధి ఎలాంటిదో గమనించాలని అడుగుతున్నా. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా.
* మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.