తెలుగులో హారర్ కామెడీ జోనర్లో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అలాంటి హారర్ కామెడీ జోనర్ ను కొత్తగా టచ్ చేసిన సినిమాగా ‘గీతాంజలి’ నిలిచింది. కంటెంట్ వైపు నుంచి .. టేకింగ్ వైపు నుంచి ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. అంజలి – శ్రీనివాస రెడ్డి – రావు రమేశ్ .. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఈ కథ, ప్రేక్షకులను అలా కట్టిపడేసింది. ఒక వైపున హాస్యాన్ని .. మరో వైపున భయాన్ని కలిపి నడిపించిన తీరు ఆడియన్స్ ను మెప్పించింది. రావు రావు రమేశ్ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది.
అంజలి మంచి ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నటనలో ఈజ్ .. తెలుగులో డైలాగ్స్ ను గలగలమంటూ చెప్పుకుపోవడమే ఆమెకి ఎక్కువమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ‘గీతాంజలి’ సినిమాలో ఆమె రెండు పాత్రలను కూడా గొప్పగా చేసింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చేసింది’ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా నిర్మాణంలో కోన కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమాతో ఆయన శివ తుర్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
అలాంటి ఈ సినిమాకి సంబంధించి కొంత సేపటి క్రితం కొత్త పోస్టర్ ను వదిలారు. ఒక రకంగా ఇది అంజలి ఫస్టు లుక్ అనుకోవలసిందే. నాట్య భంగిమలో అంజలి లుక్ చూస్తుంటే, ‘చంద్రముఖి’ గుర్తుకు రావడం ఖాయం. అయితే కథా పరంగా ఎలాంటి పోలిక ఉండే అవకాశం లేదు. ఎందుకంటే స్క్రిప్ట్ పరంగా కోన అద్భుతాలు చేయగలరు. ఫస్టులుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచడంలో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఫస్టు పార్టు మాదిరిగానే ఈ సినిమా మరో ట్రెండ్ ను సృష్టిస్తుందేమో చూడాలి.