ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం – జనసేన మధ్య పొత్తు కొలిక్కి వచ్చినా సీట్ల సర్దుబాటుపై ప్రాథమికంగా చర్చలు ప్రారంభం కాలేదు. 25 నుంచి 30 సీట్లు జనసేనకు ఇస్తారని ఉహాగానాలు వినిపిస్తున్నా ఏ సీట్లు అనేది తేలాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానాలు మాత్రం ఫైనల్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. కాకినాడ, తిరుపతి రెండు చోట్ల బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాకలో పవన్ కళ్యాణ్ కు 56,125 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి 25 వేల పైచిలుకు మెజారిటితో విజయం సాధించారు. భీమవరంలో 62,285 ఓట్లు వచ్చాయి. 20వేలకు పైగా ఆధిక్యంతో వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ గెలిచారు. ఒక చోటనే పోటీ చేసి ఉంటే పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టేవారని అప్పుడు జనసేన నేతలే అన్నారు.
తిరుపతిలో బలిజ సామాజికవర్గం గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గెలిచారు. సోదరుడు చిరంజీవి వెంట నిలిచిన ప్రజలే తన వైపు ఉంటారని అదే సెంటిమెంటుతో లబ్ది పొందాలని తిరుపతి ఎంచుకున్నారని అంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బలమైన నేత, నిత్యం ప్రజల్లో ఉండే భూమన ఈ దఫా తన కుమారుడు అభినయ్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నారని సమాచారం. పొత్తుల్లో జనసేనకు తిరుపతి ఇస్తే… ఈ సీటు ఆశిస్తున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణ జనసేనకు ఎంతవరకు సహకరిస్తారో…పవన్ పోటీపై ఆమె వైఖరి బహిరంగంగా వ్యక్తం చేయటం లేదు.
కాకినాడ సిటి నియోజకవర్గంలో కాపులు అధికంగా ఉండటం కలిసి వస్తుందని మరో అంచనా. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ముఠ శశిధర్ కు 30,188 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించగా టిడిపి రెండో స్థానంలో..జనసేన మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే రెండు పార్టీల ఓట్లు జతకలిస్తే తమదే విజయమని జనసేన లెక్కలు వేస్తోంది.
రెండు చోట్ల పోటీ చేసిన వారిని ఇటీవల ప్రజలు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో మాజీ సిఎం కెసిఆర్, ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డిలను ప్రజలు తిరస్కరించారు. తమకు అందుబాటులో ఉండే నేతకు పట్టం కట్టారు. అదే రీతిలో హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్ల పోటీ చేసిన బిజెపి నేత ఈటెల రాజేందర్ ఘోర పరాభావం చవి చూశారు. ఓటమి ఎరుగని ఈటెలకు ప్రజలు పరాజయం రుచి చూపించారు.
గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి భంగపాటుకు గురైన పవన్ కళ్యాణ్ తిరిగి అదే ప్రయోగానికి సిద్దం కావటం ఆత్మహత్యా సదృశ్యమని విశ్లేషణ జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందని విపక్ష నేతలు చెపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎత్తుగడ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.
-దేశవేని భాస్కర్