ఈ మధ్య కాలంలో అటు వెండితెరపై .. ఇటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా చిన్న సినిమాల జోరు కొనసాగుతోంది. గతంలో స్టార్స్ సినిమాలపైనే ఆడియన్స్ దృష్టి ఉండేది. అలాగే పెద్ద బ్యానర్లపై వస్తేనే తప్ప పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దర్శకుడు .. హీరో కొత్తవారే అయినా, అప్పుడప్పుడే పైకి వస్తున్న వారైనా ఫరవాలేదు. కథలో విషయం ఉంటే చాలు, తాము చూడటమే కాకుండా పదిమందికి చెబుతున్నారు.
అలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మరింత స్పీడ్ తో ముందుకు దూసుకుపోతున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ‘పార్కింగ్’ ఒకటిగా కనిపిస్తుంది. హరీశ్ కల్యాణ్ .. భాస్కర్ .. ఇందుజా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, డిసెంబర్ 1వ తేదీన తమిళనాట థియేటర్లకు వచ్చింది. మొదట్లో ఈ సినిమాను లైట్ తీసుకున్న ఆడియన్స్, ఆ తరువాత కంటెంట్ గురించి విని థియేటర్లకు పరిగెత్తుకు వచ్చారు. దాంతో ఆ సినిమా అక్కడ హిట్ టాక్ సంపాదించుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.
ఆ సినిమా డిసెంబర్ 30వ తేదీ నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో అందుబాటులోకి వచ్చింది. ఒక ఇంట్లో అద్దెకి ఉండేవారి మధ్య పార్కింగ్ ప్లేస్ విషయంలో చిన్నగా గొడవ మొదలవుతుంది. అది చాలా చిన్న సమస్య అయినప్పటికీ ఇద్దరి ‘ఈగో’ దెబ్బతింటుంది. దాంతో ఎవరికి వారు ఆ పార్కింగ్ ప్లేస్ లో తమ బండి పెట్టడానికి పోటీపడటం మొదలవుతుంది. ఆ పోటీ ఎంతవరకూ వెళుతుందనేది దర్శకుడు చూపించిన తీరు, ఆడియన్స్ ను అలా కట్టి పడేస్తుంది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమా దూసుకుపోతుండటం విశేషం.