సాధారణంగా తెరపై హీరోయిజం మూడు రకాలుగా కనిపిస్తుంది. హీరోయిన్ ప్రేమను గెలుచుకోవడమే హీరో తన అంతిమ లక్ష్యంగా పోరాడతాడు. తన ఊరు బాగు కోసం స్వార్థ శక్తులపై హీరో పోరాడటం మరికొన్ని సినిమాల్లో కనిపిస్తుంది. ఇక తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఎలాంటి శక్తులకైనా ఎదురెళ్లడం లోను హీరోయిజం కనిపిస్తుంది. ఈ మూడో అంశానికి సంబంధించిన నేపథ్యంలో రూపొందిన సినిమాగా ‘సైంధవ్’ తెరపైకి రానుంది. శైలేశ్ కొలను ఈ సినిమాకి దర్శకుడు.
వెంకటేశ్ కి హీరోగా ఇది 75వ సినిమా. కథలో దమ్ము ఉంటే తప్ప ఆయన ఒప్పుకోడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తన 75వ సినిమాకి సంబంధించిన కథలను చాలా కాలంగా వెంకటేశ్ వింటూ వస్తున్నారు. అలా చాలా కథల తరువాత ఆయన ఓకే చేసిన కంటెంట్ ఇది. రీసెంటుగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ద్వారా కథ ఏమిటి అనే విషయంలో ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చేశారు. అందువలన ప్రేక్షకుడు కూడా క్లారిటీతో థియేటర్లోకి అడుగుపెడతాడు.
ఈ కథలో హీరో కూతురు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఒక రకమైన ఇంజక్షన్ చేయడం వలన ఆ పాపను రక్షించుకోవచ్చని డాక్టర్లు చెబుతారు. ఆ ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు. అది హీరో శక్తికి మించిన విషయం. కానీ తన బిడ్డను బ్రతికించుకోవాలని హీరో భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అనే అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతోంది. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ను బట్టి చూస్తే వెంకటేశ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు మరి.