Saturday, November 23, 2024
HomeTrending Newsనల్లమల సమీపంలో ఎన్నికల సందడి

నల్లమల సమీపంలో ఎన్నికల సందడి

పాలమూరు ఉమ్మడి జిల్లాలో పట్టు నిల్పుకోవాలని బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది. నల్లమల సమీపంలోని నాగర్ కర్నూల్లో పాగా వేయాలని బిజెపి ప్రణాళికలు సిద్దం చేస్తుంటే…ఆ స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడాల్సిందేనని సిఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. సామాజిక వర్గాల వారిగా చూస్తే ఈ నియోజకవర్గంలో మాదిగలు ప్రభావిత వర్గంగా ఉన్నారు. ప్రధాన పార్టీలు మాదిగలను రంగంలోకి దించాలనే యోచనతో రాష్ట్రస్థాయి నేతలు, పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారుల కోసం అన్వేషణ మొదలు పెట్టాయి.

బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన నాగర్ కర్నూల్ ఎంపి పి రాములు… ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ కోసం యత్నిస్తున్నారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తన కుమారుడికి దక్కకుండా చేశారని ఎమ్మెల్యే బాలరాజుతో విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్తో రాములు సన్నిహితంగా ఉంటున్నట్టు గులాబీ నేతల దృష్టికి వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను ఎంపి బరిలో నిలిపితే విజయం ఖాయమని బీఆర్ఎస్ వ్యూహంగా ఉంది.

కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ టికెట్ మల్లు రవి ఆశిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడైన మల్లు రవి సిఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావటం ఆయనకు అదనపు అర్హత. కాగా మల్లు రవి సోదరుడు మల్లు అనంత రాములు గతంలో పిసిసి అధ్యక్షుడిగా బాద్యతలు నిర్వహించారు. ఇక్కడి నుంచి మల్లు రవి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించగా ఆయన సోదరుడు మల్లు అనంత రాములు రెండుసార్లు ఎంపిగా సేవలు అందించారు.

ఇదే స్థానాన్ని ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఆశిస్తున్నారని తెలిసింది. అధిష్టానం వద్ద మంచి పేరు ఉన్న సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఇంచార్జ్ గా…కర్ణాటక పరిశీలకుడిగా బాద్యతలు నిర్వహించారు. AICC కార్యదర్శిగా ఉన్న సంపత్ కు ఇవ్వాలని పార్టీలోని ముఖ్య నేతలు అధిష్టానం వద్ద అభిప్రాయం తెలిపారని సమాచారం.

అటు బిజెపి నుంచి పోటీ చేసేందుకు బంగారు శృతి రంగం సిద్దం చేసుకున్నారు. దివంగత నేత బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం నాగర్ కర్నూల్లో కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో ఆచారితో కలిసి పార్టీ విజయం కోసం అక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి టికెట్ బంగారు శ్రుతికి ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నేత సతీష్ మాదిగ కూడా టికెట్ ఆశిస్తున్నారు.

కర్ణాటక అడిషనల్ డిజిపిగా సేవలు అందించి… ఇటీవలే పదవీ విరమణ చేసిన మాజీ ఐపిఎస్ అధికారి పుట్టపాగ రవీంద్రనాథ్ ను తీసుకురావాలని బిజెపి సంప్రదింపులు చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నడ నాట ఫైర్ బ్రాండ్ గా పేరున్న రవీంద్రనాథ్ కు ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వంతోనే భేదాభిప్రాయాలు వచ్చాయి. విషయం తెలిసిన కాంగ్రెస్, బీఎస్పీ నేతలు కూడా ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పీ రవీంద్రనాథ్ తండ్రి పి. మహేంద్రనాథ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. రవీంద్రనాథ్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లాలోని జోన్నలబోగడ గ్రామం. చర్చలు కొలిక్కి వస్తే రవీంద్రనాథ్ లేదంటే బంగారు శృతి బిజెపి నుంచి బరిలో ఉంటారు.

బంగారు శృతి మాదిగ సామాజిక వర్గం కాగా మల్లు రవి, గోరేటి వెంకన్న, పి రాములు, సంపత్ కుమార్ మాల సామాజికవర్గానికి చెందినవారు. మాదిగ సామాజిక వర్గానికే చెందిన బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీకి దిగొచ్చని ఉహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్, బిజెపిలకు ఎంపి సీట్లు కీలకం కావటంతో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

–దేశవేని భాస్కర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్