వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా విజయం సాధిస్తానని టిడిపి నేత, విజయవాడ ఎంపి కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి మొదటివారంలో తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని… 2024 మే వరకూ తాను విజయవాడ ఎంపీనేనని చెప్పారు. ఢిల్లీ వెళ్ళాలంటే ఏదో ఒక ఫ్లైట్ లో వెళ్ళాల్సి ఉంటుందని, ఏ ఫ్లైట్ దొరక్కపోతే ప్రైవేటు జెట్ లో నైనా వెళ్ళక తప్పదని నర్మగర్బ వ్యాఖ్యలు చేశారు.
ఏడాదికాలంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కేశినేని నాని, ఆయన సోదరులు చిన్ని వర్గాల మధ్య పోరు జరుగుతూ వస్తోంది. యువగళం పాదయాత్ర నిర్వహణా బాధ్యతలు చిన్ని చూసుకున్నారు. ఈ యాత్రకు నాని దూరంగా ఉన్నారు. విజయవాడ టిడిపి నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్ మీరా లు కూడా నానిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. జనవరి 1 న నాని మరోసారి పరోక్షంగా తనను వ్యతిరేకిస్తున్న నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే… నేటి నుంచి తెలుగుదేశం పార్టీ లోక్ సభ యూనిట్ గా భారీ సభలు నిర్వహిస్తోంది. విజయవాడ నియోజకవర్గ సభను తిరువూరులో రేపు జరుపుతున్నారు. ఈ సభ నిర్వహణ విషయంలో మరోసారి నాని-చిన్ని వర్గాల మధ్య ఘర్షణ జరిగి పోలీసు కేసుల వరకూ వెళ్ళింది. దీనిపై దృష్టి సారించిన చంద్రబాబు నిన్న పార్టీ సీనియర్ నేతలు నెట్టెం రఘురాం, ఆలపాటి రాజా, కొనకళ్ళ నారాయణలను నాని వద్దకు పంపి తిరువూరు సభ బాధ్యతలు చిన్నికే ఇస్తున్నట్లు, వచ్చే ఎన్నికల్లో కూడా కేశినేని నాని బదులు చిన్ని పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని నాని ట్విట్టర్, పేస్ బుక్ ద్వారా స్వయంగా వెల్లడించారు.
నేటి ఉదయం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన నాని పార్టీ వీడుతున్న సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతానికి తన బాస్ చంద్రబాబేనని ఆయన చెప్పినట్లే వింటానని స్పష్టం చేశారు. ఎప్పుడూ చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని, పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని పేర్కొన్నారు. బాబు తనను వద్దని అనుకున్నారని, తానువద్దని అనుకోలేదని, ఆయనతో రోజూ ఫోన్ మాట్లాడుతూనే ఉంటానని.. గతంలో ఎప్పుడూ చివరి నిమిషం వరకూ అభ్యర్ధులను తెల్చేవారు కాదని, కానీ ఇప్పుడు మాత్రం తన విషయంలో ఇలా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.