కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. సిఎం రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాలు చక్కదిడ్డుతూ, అధికారుల సమర్థతను బట్టి బాధ్యతలు అప్పగిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలులోకి వచ్చాయి. అందులో రైతు భరోసా పాతదే కాగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో మిగిలిన వాటిని ఆచరణలో పెట్టేందుకు కసరత్తు మొదలైంది. ప్రజా దర్బార్ పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలపై అర్జీలు మంత్రులు స్వీకరిస్తున్నారు. రాయదుర్గం – శంషాబాద్ మెట్రో రద్దు ప్రకటనను సిఎం రేవంత్ రెడ్డి చేయగానే ప్రజల నుంచి హర్షం వ్యక్తం అయింది. విమానాశ్రయానికి సిఎం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ మార్గంపై కసరత్తు జరుగుతోంది.
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ స్వీకరణ అనంతరం 33 జిల్లాలుగా విస్తరించింది. ఇప్పుడు జిల్లాల సంఖ్యను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త ప్రభుత్వంలో మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారిగానే ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ను సిద్ధిపేట జిల్లా నుంచి తప్పించి కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఎన్నికల సమయంలో వినతులు వచ్చాయి. ఈ విధంగా సూర్యాపేట జిల్లాలో డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం జిల్లాల హద్దులు మారిస్తే రద్దు చేయబోయే జిల్లా ప్రజలు నిరసన వ్యక్తం చేసే ప్రమాదముంది.
రవాణా శాఖలో ఉన్న TSను TGగా మారుస్తామని గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కొత్త సిరీస్ తీసుకొస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు ఉత్పన్నమవుతాయని అధికారులు అంటున్నారు. 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన గత ప్రభుత్వం 25 జిల్లాల్లో వాటిని పూర్తి చేసినా మరో ఎనిమిది జిల్లాల్లో పెండింగ్ ఉంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది.
త్వరలోనే జాతీయ మెడికల్ కమిషన్ తనిఖీలకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం వీటిపై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది. ఉన్న కళాశాలల్లోనే బోధనా సిబ్బంది సరిపడా లేరని కొత్త కాలేజీల ఏర్పాటుకు కొంత సమయం తీసుకుంటే మంచిదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తవి ఆలస్యం జరిగితే విపక్షం విమర్శలకు దిగే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో 30 విధాలుగా తెలంగాణ ప్రజలను వంచించిన కాంగ్రెస్ అని బీఆర్ఎస్ కరపత్రం విడుదల చేసింది.
ఎన్నికల ఏడాది దృష్ట్యా సిఎం రేవంత్ రెడ్డి వీటిపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోక పోవచ్చని, లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే వీటిని సమీక్షిస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
-దేశవేని భాస్కర్