సిఎం జగన్ తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నానని విజయవాడ ఎంపి, టిడిపి నేత కేశినేని నాని ప్రకటించారు. ఎంపి పదవికి మెయిల్ ద్వారా రాజీనామా చేస్తానని, అది ఆమోదం పొందగానే పార్టీకి కూడా రాజీనామా చేసి అధికారికంగా వైసీపీలో చేరతానని వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం వైఎస్ జగన్ తో కేశినేని భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పచ్చి మోసగాడని తెలుసని కానీ ఇంత మోసగాడని తెలియదని, అతనితో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తానొక్కడినే పార్టీ మారడం లేదని, ఎన్టీఆర్ జిల్లాలో 60శాతం టిడిపి ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టి, నా కుటుంబ సభ్యులతోనే తనను కొట్టించాలని చూశారని ఆవేదన వెలిబుచ్చారు. సిఎం జగన్ నిరుపేదల పక్షపాతి అని, ఆయన పథకాలు పేదలకు అందుతున్నాయని… అభివృద్ధిపరంగా కొన్ని ఇబ్బందులున్నా, కరోనా వల్ల మన ఒక్క రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు.
2013లో టిడిపిలో చేరినప్పటినుంచీ విజయవాడ పార్లమెంట్ పరిధిలో పాటీ పటిష్టత కోసం కృషి చేశానని, సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీని నిలబెట్టానని అలాంటిది పార్టీ నాయకులతోనే తనను తిట్టిన్చారని… చెప్పు తీసుకొని కొడతానని ఒకరు, గొట్టంగాడు అని మరొకరి తిడితే నాయకత్వం నుంచి కనీస స్పందన కూడా లేదని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు సభకు కూడా తనను వద్దని చెప్పడం బాధ కలిగించిందన్నారు.
టిడిపిలో విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావు పేట సీట్లలో ఎపుడూ కమ్మవారే నిలబడతారని, తన కుటుంబంలో మరో వ్యక్తికి సీటు ఇవ్వదలచుకుంటే వేరే సీటు ఇవ్వొచ్చని .. లేదా తనను వద్దని నేరుగా చెబితే సరిపోయేది కదా అని నాని అన్నారు.
పాదయాత్ర చేసే హక్కు లోకేష్ కు ఎక్కడుందని, ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అని, తాను గెలిచిన ఎంపినని, ఏ ప్రోటోకాల్ తో ఆయన పాదయాత్రలో పాల్గొనాలని ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు కాబట్టి జీ హుజూర్ అనాలా అని నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో నాని వైసీపీ నుంచి ఎంపిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ నాని పోటీ చేయకపోతే ఆయన కుమార్తె కేశినేని శ్వేతను పార్లమెంట్ కు లేదా విజయవాడ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నిన్న రాత్రే కేశినేనితో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయి రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం నేడు వైసీపీ నేతలు ఎంపి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, విజయవాడ తూర్పు ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ లు నానిని వెంట పెట్టుకొని క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. నాని కుమార్తె కేశినేని శ్వేత ఇప్పటికే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11 వ డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు.