కేవలం ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలకు చెందినవారి సీట్లు మాత్రమే సిఎం జగన్ మారుస్తున్నారని, అగ్రవర్ణాల సీట్లు మాత్రం మార్చడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అగ్రవర్ణాల సీట్లు మారిస్తే వారు ఎడురుతిరుగుతారని భయమని అందుకే వారి జోలికి వెళ్ళడం లేదని, ఇదేమి సామాజిక న్యాయమని ప్రశ్నించారు. 8౦మంది ఎమ్మేల్యేలను మారుస్తున్నారని, ఏమి చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికల జాబితాలో అక్రమాలపై టిడిపి, జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా చైతన్యం తీసుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేసి, మళ్ళీ జగన్ గెలిస్తే ఏమి జరుగుతుందో తెలియజెప్పాలని కోరారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ‘రా కదలిరా’ సభ బొబ్బిలిలో జరిగింది.
ఈ సభలో బాబు మాట్లాడతూ… తనను, లోకేష్, పవన్ కళ్యాణ్, తన కుటుంబ సభ్యులను తిట్టిన వారికి జగన్ అవార్డులు ఇస్తున్నారని, ఎంత ఎక్కువగా తిడితే అంతగా బూతుశ్రీ, బూతు రత్న, బూతు భూషణ్, బూతు సామ్రాట్ ల పేరిట సత్కరిస్తున్నారని, ఎక్కువ తిట్టిన వారికే ఎంపి, ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పడం రోత రాజకీయం అని మండిపడ్డారు. అంగన్ వాడీలు తమ ఆకలి కోసం పోరాటం చేస్తుంటే… అధికార పార్టీ ఎమ్మెల్యేలు చులకనగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను అధికారంలోకి రాగానే రోడ్లకు మహర్దశ పడుతుందని, అన్ని రోడ్లు బాగుచేసే కార్యక్రమాన్ని చేపడతానని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందామని, దీనికోసం ప్రజలంతా కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించే విధంగా సంక్రాంతి పండుగకు సంకల్పం తీసుకోవాలని కోరారు.