Tuesday, January 21, 2025
HomeTrending Newsజనసేనలోకి ముద్రగడ... మేలు జరుగుతుందా?

జనసేనలోకి ముద్రగడ… మేలు జరుగుతుందా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్నారనే వార్తలతో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టిడిపి – జనసేన కూటమి ముద్రగడ రాక తమకు మేలు చేస్తుందనే భావనలో ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు తమకే పడతాయని, వైసిపికి నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని విశ్లేషణ చేస్తే కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

కాపుల ఐక్యత, హక్కుల కోసం రెండు దశాబ్దాలుగా ముద్రగడ పద్మనాభం రాజీలేని పోరాటం చేస్తున్నారు. ముద్రగడ పిలుపు ఇస్తే కాపులు కదిలివస్తారు. ముద్రగడ పాలిటిక్స్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతానంటూ ఇటీవలే చెప్పారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ అమలు చేయాలని ముద్రగడ ఉద్యమం చేపట్టిన సమయంలో వైసిపి ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చింది. 2019లో వైసిపి గెలిచిన దగ్గర నుంచి అనేక విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ముద్రగడ లేఖలు రాశారు.

ముద్రగడ వైసీపీలో చేరతారనుకుంటున్న తరుణంలో జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనను జనసేనలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు కూడా ముద్రగడను జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన కూటమిలోకి రావటం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించినట్లు సమాచారం.

సంక్రాంతికి పవన్ కళ్యాణ్… ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తారని, పార్టీలో చేరికపై సంక్రాంతి తరువాత క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం తోడైతే.. గెలుపు నల్లేరుపై నడకేనన్న అంచనాలు ఉన్నాయి.

టిడిపి హయంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కున్న ముద్రగడ కొత్త ప్రతిపాదన చేస్తున్నట్టు సమాచారం. టిడిపితో పొత్తు పెట్టుకోకుండా బిజెపితో కలిసి ఎన్నికలకు వెళితే జనసేనలో ఆయన చేరే అవకాశం ఉందని కొందరు కాపు నేతలు అంటున్నారు. ఈ దశలో ముద్రగడ ప్రతిపాదనకు పవన్ ఒప్పుకోకపోవచ్చు.

రాజకీయంగా పలుకుబడి కలిగిన ముద్రగడ గతాన్ని మరచి జనసేన – టిడిపితో జతకలిస్తే కాపులకు తప్పుడు సంకేతాలు వెళతాయని విశ్లేషణ జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు ట్రాప్ లో పవన్ పడ్డారని, ఇప్పుడు ముద్రగడ వెళితే కాపుల రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందని అంటున్నారు. రాజకీయంగా వెన్నంటి ఉన్న వైసిపిని వదిలి టిడిపితో వెళితే ఆత్మహత్యాసదృశ్యం అవుతుని హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ ముద్రగడ వెళ్ళినా గోదావరి జిల్లాల్లో కూటమి నుంచి అత్యధికంగా కాపులకు టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. కాపులు-కమ్మలు జతకడితే కోస్తా జిల్లాల్లో కూటమి పట్ల బిసిల్లో వ్యతిరేకత పెరుగుతుందనే వాదన ఉంది. SC, BC వర్గాల నేతలు బహిరంగ విమర్శలు చేయకపోయినా క్షేత్ర స్థాయిలో కూటమిని దెబ్బ కొడతారని చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్