వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న గిడుగు రుద్రరాజు నిన్న తన రాజీనామాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అందజేసిన విషయం తెల్సిందే. రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన షర్మిల…. తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు చేసిన సమయంలో ఆ పార్టీ తరఫున ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొంత కాలానికి ఆమె తెలంగాణా కేంద్రంగా వైఎస్సార్ తెలంగాణా పార్టీని స్థాపించి పలు ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించారు. అయితే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఒక్కసారిగా తన పార్టీ కార్యకలాపాలు ఆపేశారు. కాంగ్రెస్ పార్టీ ఆమెతో జరిపిన సంప్రదింపులు ఫలించి ఇటీవలి తెలంగాణా ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగి ఆ పార్టీకి భేషరతుగా మద్దతు ప్రకటించారు. ఈనెల 4న ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో రాహూల్ గాంధీ, ఖర్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని లాంఛనంగా విలీనం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏపీలో కూడా పార్టీ బలోపెతంపై అధినాయకత్వం దృష్టి సారించింది. వైఎస్ తనయగా ప్రజల్లో ఆమెకున్న క్రేజ్ ను పార్టీ పూర్వ వైభవానికి వినియోగించుకోవాలని భావించి షర్మిలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.