Friday, September 20, 2024
HomeTrending Newsఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ గురి

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ గురి

కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఆదరణ కరువవుతోంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో దక్షిణాదిలో బలపడాలని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధిక స్థానాలు కొల్లగొట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో కొంత మెరుగ్గా ఉన్నా… ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోంది.

తెలంగాణలో YSRTP స్థాపించి పాదయాత్ర చేసిన ys షర్మిల ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో తన పార్టీ విలీనం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే షర్మిలకు రాజ్యసభ MP పదవి అని ఉహాగానాలు వినిపించినా…అనూహ్యంగా ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేశారు. ఏపిలో టిడిపి,జనసేన – YSRCP పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వీరి మధ్య పోటీలో లబ్ది పొందేందుకు షర్మిల ద్వారా రాజకీయం మొదలుపెట్టింది.

ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కనివారిని పార్టీలో చేర్చుకొని చేతు గుర్తు మీద బరిలో నిలిపేలా ప్రణాలికలు సిద్దం చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన అధిష్టానం షర్మిలను అధ్యక్షురాలిని చేసిన వెంటనే జిల్లాల యాత్రకు పురమాయించింది. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అంగ, అర్థబలం సమకుర్చేలా ఆయా రాష్ట్ర నాయకత్వాలకు దిశా నిర్దేశం చేశారు.

ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే పేరుతో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అధికార పార్టీ నేతలపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల ప్రకారమే షర్మిల విమర్శలు కొనసాగుతున్నాయని స్పష్టమవుతోంది.

అమరావతి భూముల అక్రమాల ఆరోపణల్లో టిడిపిపై విమర్శలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విశ్లేషణ జరుగుతోంది. ఎన్నికల తర్వాత టిడిపి కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే విధంగా అవగాహన జరిగిందని ఢిల్లీలో పుకార్లు వినిపిస్తున్నాయి.

రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు మిత్ర పక్షాలను మార్చే చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని పార్టీలో సీనియర్ నేతలు అధిష్టానాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్థానాలతో పోలిస్తే ఎంపి స్థానాలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పయనం సాగుతోంది. రాష్ట్రంలో కనీసం రెండు మూడు ఎంపి సీట్లు గెలుచుకోవాలని, 15 వరకు ఎమ్మెల్యే స్థానాల్లో గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారని తెలిసింది.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి సీట్లు దక్కకుండా చేయటంపై కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఏపిలో ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాలనే లక్ష్యంగా హస్తం నేతలు పనిచేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టుగా టిడిపి జనసేన కూటమి, YSRCP ల మధ్య లబ్ది పొందాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్