తిరుమల శ్రీవారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంటే కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తోన్న శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో సుమారు 57 మంది పీఠాదిపతులు పాల్గొంటున్నారు. మొదటిరోజు సదస్సుకు హాజరైన పీఠాదిపతులకు భూమన, ఈవో ధర్మారెడ్డిలు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రారంభోత్సవ సభలో భూమన మాట్లాడుతూ ధర్మ స్థాపన కోసమే తిరుమలలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టిటిడి ఆళ్వార్లు ప్రాజెక్టు ఇప్పటికే నిర్వహిస్తోందని, 32 వేల కీర్తనలను నిర్వహించిన అన్నమయ్య ప్రాజెక్టును కూడా నిర్వహిస్తున్నామని స్వామివారి సేవకు పునరంకితం కావడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
బాల బాలికల స్థాయి నుంచే హిందూ వ్యాప్తి చేయాలని కంకణం కట్టుకున్నామని, దానికి పీఠాధిపతులు తమ అమూల్య సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ తో భాగంగా దేశ వ్యాప్తంగా తితిదే ధర్మ ప్రచారం చేస్తోందని, ఈ ధార్మిక సదస్సుద్వారా భారతదేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉద్యమం కలుగుతుందని భూమన విశ్వాసం వ్యక్తం చేశారు.