తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాడేల్లిలోని తన నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఇరు పార్టీలూ పోటీ చేయనున్న స్థానాల సంఖ్యపై ఇరువురు నేతలూ ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటనలో దూకుడుగా ఉండడం, బిసిలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తుండడంతో తమ కూటమి నుంచి కూడా అభ్యర్ధుల ప్రకటన వీలైంత త్వరగా జరిగేలా చూడాలని రెండు పార్టీల నుంచీ ఆయా అధినేతలపై ఒత్తిడి వస్తోంది. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే అభ్యర్థుల ప్రకటనలో జరుగుతోన్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేటి సమావేశంలో సీట్ల సంఖ్యతో పాటు ఎవరెవరు ఏయే సీట్లలో పోటీ చేయాలన్న దానిపైకూడా ఓ ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో అధికార వైసీపీ నుంచి తమ పార్టీ లోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు జనసేనకు కేటాయించాలన్న ప్రతిపాదన బాబు ముందు పవన్ ఉంచారు. ఉమ్మడి మేనిఫెస్టో, రెండు పార్టీల సంయుక్త సభలపై కూడా చర్చించారు.