Friday, November 22, 2024
HomeTrending Newsదక్షిణ తెలంగాణలో పట్టు కోసం కెసిఆర్ వ్యూహం

దక్షిణ తెలంగాణలో పట్టు కోసం కెసిఆర్ వ్యూహం

రాబోయే లోకసభ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటేందుకు.. ముఖ్యంగా దక్షిణ తెలంగాణపై పట్టు బిగించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. మూడు నెలల విరామం తర్వాత కెసిఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి రాగా… కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై కేసీఆర్‌ సమీక్షించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షించి.. కృష్ణా జలాల అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

సుమారు వంద రోజుల తర్వాత అధినేత రావటంతో తెలంగాణ భవన్‌కు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేఆర్‌ఎంబీపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

దక్షిణ తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృష్ణా జలాల అంశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు హితబోధ చేసిన కెసిఆర్ కార్యక్రమాల రూపకల్పనకు ఉపక్రమించారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాదకర వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై తెలంగాణకు రావలసిన వాటాను హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం తీర్మానించింది.

మరోవైపు భార‌త రాష్ట్ర స‌మితికి (బీఆర్ఎస్‌) గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన పెద్ద‌ప‌ల్లి (ఎస్సీ) లోక్‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్ బొర్ల‌కుంట వెంక‌టేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ తేల్చకపోవటం.. కొంత‌కాలంగా బీఆర్‌ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ వైఖ‌రితో అసంతృప్తిగా ఉన్న వెంక‌టేష్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. న్యూఢిల్లీలో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సంస్థాగ‌త‌) కేసీ వేణుగోపాల్, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో మంగ‌ళ‌వారం ఎంపీ వెంక‌టేష్ నేత కాంగ్రెస్‌లో చేరారు. అటు ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ స‌భ్యుడు మ‌న్నె జీవ‌న్ రెడ్డి.. కేసీ వేణుగోపాల్‌, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేరారు.

పార్టీ నేతలు వలస బాట పట్టడం..లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవటం గులాబీ అధినేతకు సవాల్ గా మారింది. కేటిఆర్,హరీష్ రావు పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నా.. కెసిఆర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో కృష్ణ జలాల అంశం తెరపైకి రావటంతో పార్టీ గళం బలంగా వినిపించే అవకాశం వచ్చింది. ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కెసిఆర్ సిద్దం అయ్యారు.

మూడు నెలలుగా నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో కెసిఆర్ పునరాగమనంతో కొంత ఉత్సాహం రానుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్