బాలీవుడ్ లో కథానాయికగా భూమి పెడ్నేకర్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకు కారణం ఆమె ఎంచుకునే కథలు .. ప్రత్యేకమైన పాత్రలు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే చేస్తూ, సహజమైన నటనను ఆవిష్కరిస్తూ ఉంటుంది. అందువల్లనే ఆమెను అభిమానించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాంటి ఆమె తాజా చిత్రంగా రూపొందినదే ‘భక్షక్’. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, షారుక్ ఖాన్ సొంత బ్యానర్ నుంచి రావడం విశేషం.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ వారు దక్కించుకున్నారు. నిన్నటి నుంచే ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ కథ బీహార్ – పాట్నా పరిసర ప్రాంతాల్లో నడుస్తుంది. కొంతమంది అనాథ బాలికలను బన్సీ సాహు చేరదీస్తూ ఉంటాడు. ఆ బాలికలను ఒక ఇంట్లో బంధించి, తన లైంగిక అవసరాలను తీర్చుకుంటూ .. అదే లంజ వ్యాపారంగా కొనసాగిస్తూ ఉంటాడు. ఈ విషయం జర్నలిస్ట్ వైశాలీకి తెలుస్తుంది. తాను సొంతంగా ఒక టీవీ ఛానల్ ను నిర్వహిస్తూ ఉంటుంది.
అయితే బన్సీలాల్ డబ్బు .. పరపతి ఉన్నవాడు. అతనికి రాజకీయనాయకులు తెలుసు. అతని క్రింద కొంతమంది రౌడీలు పనిచేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడం మంచిది కాదని భర్త చెబుతున్నా వినిపించుకోకుండా రహస్యాన్ని బయటపెట్టడానికి వైశాలి ప్రయత్నిస్తుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? అనే పాయింట్ పై ఈ కథ నడుస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మితమైన ఈ సినిమాకి పులకిత్ దర్శకత్వం వహించాడు.