పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా రూపొందుతోంది. ఎ. ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమైంది. 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. పవన్ స్టిల్స్ ఆయన అభిమానుల్లో అంచనాలు పెంచాయి. అయితే కరోనా కాలంలో ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఆ తరువాత ఒకటి రెండు చిన్న షెడ్యూల్స్ ను చేశారంతే. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.
ఈ కథ చారిత్ర నేపథ్యంతో ముడిపడి నడుస్తుంది. అందువలన ఆ కాలానికి సంబంధించిన సెట్స్ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ వెళ్లారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. పవన్ ‘OG’ ప్రాజెక్టు వైపుకు వెళ్లడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇటీవలే క్రిష్ కూడా మరో ప్రాజెక్టుపైకి వెళ్లడంతో ఈ టాక్ మరింతగా బలపడింది. అందువల్లనే ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది.
‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగు ఆగినా, అందుకు సంబంధించిన వీఎఫ్ ఎక్స్ పనులు నడుస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ .. చెన్నై .. బెంగుళూర్ .. కెనడా .. ఇరాన్ లలో అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మంచి అవుట్ పుట్ కోసం తామంతా కష్టపడుతున్నామని అన్నారు. అంచనాలకు మించి ఈ సినిమా ఉండేలా కసరత్తు నడుస్తుందంటూ స్పష్టత ఇచ్చారు. పవన్ అందుబాటులోకి రాగానే మళ్లీ ఈ సినిమా షూటింగు మొదలవుతుందన్న మాట.