చంద్రబాబు, ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే, తాము ఏర్పాటు చేసిన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి మొక్క లాంటిదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. బాబు పరిపాలన ఓ విష వృక్షమైతే, మన పరిపాలన ఓ కల్పవృక్షమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం అభినందన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.
జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
⦿ కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి, మీ అన్న సెల్యూట్ చేస్తున్నాడు.
⦿ వరుసగా నాలుగో ఏడాది చేస్తున్న ఈ అభినందన కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తున్న నగదు బహుమతిని 50 శాతం పెంచాం.
⦿ సేవా వజ్రాలకు రూ.45 వేలు, సేవా రత్నాలకు 30 వేలు, సేవా మిత్రలకు రూ.15వేలు ఇస్తున్నాం.
⦿ ప్రతి నియోజకవర్గం నుంచి 5గురు చొప్పున 875మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులతో సత్కరిస్తున్నాం.
⦿ ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధి నుంచి కనీసం 5 మంది, కార్పొరేషన్ పరిధి నుంచి 10 మంది చొప్పున 4150 వాలంటీర్లకు సేవారత్నతో గౌరవిస్తున్నాం
⦿ ఏడాదిగా సేవలందించిన 2,50,439 మంది నా వాలంటీర్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు సేవా మిత్ర అవార్డులతో సన్మానిస్తున్నాం. వీరిని అభినందిస్తూ వారికి నగదు బహుమతిగా 392 కోట్లు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వడానికి మీ అన్న సంతోషపడుతున్నాడు.
⦿ మొదటి రోజే నేను చెప్పాను. మీరు చేస్తున్నది ఉద్యోగాలు కాదని. మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతున్నారు అని చెప్పా.
⦿ ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లు అంతా నా వాళ్లు అని గర్వంగా తెలియజేస్తున్నా.
⦿ మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్నీ, గ్రామంలోని బడిని, ఆస్పత్రిని మార్చాయి. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతున్నా.
⦿ పని చేస్తున్న ప్రభుత్వం తరఫున నిజాలు వివరించేందుకు చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం గానీ, విశ్వసనీయత గానీ లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మనసేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి.
⦿ బాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. తమకు అందుతున్న పకథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.
⦿ బాబును నమ్మడం అంటే ఇంగ్లీషు మీడియం బడుల్ని, సీబీఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడునేడుని, అమ్మ ఒడిని, గోరుముద్దను, పిల్లలకిచ్చే ట్యాబుల్ని, క్లాస్ రూమును డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్ పీ ప్యానల్స్ ను పెడుతున్న మన స్కూళ్లను,క్లాస్ రూముల్ని వీటన్నింటికీ రద్దు చెబుతూ మన పిల్లల బంగారు భవిష్యత్ ను మనమే తాకట్టు పెట్టడం అని చెప్పండి.
⦿ బాబు వాగ్దానాల్ని రైతు నమ్మడం అంటే 2014 మాదిరిగా మరోసారి తాము నిలువునా మునగడానికి సిద్ధం కావడం అని చెప్పండి.
⦿ అక్కచెల్లెమ్మలు బాబును నమ్మడం అంటే పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎన్నికల తర్వాత నిలువునా దగా చేసిన బాబును మళ్లీ నమ్మవచ్చా అని అడగండి.
⦿ బాబుకు ఓటేయడం అంటే ఇంటింటికీ వచ్చి సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకొద్దు. జన్మభూమి కమిటీలు మళ్లీ రావాలి అని ఓటు వేయడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
⦿ చంద్రబాబు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
⦿ బాబుకు ఓటు వేయడం అంటే ఈ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రద్దు చేయడమే అని మీకు మీరే ఆమోదం తెలపడమే నని, జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రముఖిలు వస్తాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
⦿ వాలంటీర్ చెల్లెమ్మలంతా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకుల మీద, ఈ పెత్తందార్ల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని ప్రతి చెల్లెమ్మా చెప్పండి.
⦿ రాబోయే రెండు నెలలు మంచి చేసిన మన ప్రభుత్వాన్ని ప్రజల గుండెల్లోకి, వారి ఇళ్లలోకి స్థానం సంపాదించుకొనే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయినర్లకు బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని మిమ్మల్నందరినీ కోరుకుంటున్నా.