వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే టిడిపి కార్యకర్తలు, జన సైనికులు కుర్చీలు మడత పెడతారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఇటీవల ఓ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చిందని సిఎం జగన్ అన్నారని… తాము కూడా సిద్ధంగా ఉన్నామని ప్రతిసవాల్ చేశారు. ప్రజలందరూ కుర్చీలు మడత పెడితే జగన్ కు కుర్చీ కూడా లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం హోదాలో ఉన్న జగన్…ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం, చొక్కా చేతులు మడత పెట్టడంకాదని తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ పాలనపై జర్నలిస్టు ఆలపాటి సురేష్ రాసిన ‘విధ్వంసం’ పుస్తకాన్ని విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ పుస్తకం ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఉందని, దీన్ని ఒక ఆయుధంగా తీసుకొని రాబోయే 54 రోజులు దీనిలోని విషయాలను ప్రతిరోజూ చర్చించాలని కోరారు. రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే అమరావతిని మూడు రాజధానుల పేరుతో నాశనం చేసి ఇప్పుడు నాలుగో రాజధాని గురించి మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా ప్రస్తావిస్తూ బాబు మండిపడ్డారు.
రాష్ట్రంలో వైసేపీ ప్రభుత్వం కూల్చివేతల తోనే మొదలయ్యిందని, ఈ నాలుగున్నరేళ్ళూ విధ్వంసంతోనే సాగిందని, ఏ ప్రజలను హింసించారో.. ఎవరి జీవితాలను విధ్వంసం చేశారో ఆ ప్రజలతోనే కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శపథం చేశారు.