ఈ మధ్య కాలంలో ఓటీటీ వైపు నుంచి వచ్చిన తెలుగు సినిమాలలో అందరూ ఎక్కువ ఆసక్తిని చూపించిన సినిమాగా ‘భామాకలాపం 2’ కనిపిస్తుంది. ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురు చూసినవారున్నారు. అందుకు కారణం ఫస్టు పార్థుగా వచ్చిన ‘భామాకలాపం’ జనంలోకి దూసుకుని వెళ్లడమే. ఆ సినిమాకి ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ లభించడం వలన మేకర్స్ సీక్వెల్ ఆలోచన చేశారు .. ఆచరణలో పెట్టారు. అలా ‘భామాకలాపం 2’ రూపొందింది. నిన్ననే ‘ఆహా’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో చూపించాలనే ఉద్దేశంతో అందుకు తగినట్టుగానే కథను తయారు చేసుకున్నారు. మరికొందరు ఆర్టిస్టులను తీసుకున్నారు. కథ సాధారణమైన ఫ్యామిలీ నుంచి చిన్నపాటి హోటల్ కీ .. అక్కడి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ కి మారుతుంది. ఇక మిగతా కథంతా అక్కడే నడుస్తుంది. అక్కడ సీన్స్ ను డిజైన్ చేసుకున్న తీరు కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే తో కథను చాలా వరకూ ఆసక్తికరంగానే ముందుకుతీసుకుని వెళ్లారు. ఎక్కడ ఏం జరుగుతుందోననే ఒక టెన్షన్ ను బిల్డప్ చేశారు.
వెయ్యి కోట్ల ఖరీదైన కొకైన్ డీల్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. భాగస్వాముల మధ్య స్పర్థలు .. డీలర్ల మధ్య పోటీ .. వీళ్లందరి కళ్లుగప్పి ఆ సరుకును కొట్టేయడానికి మరో వ్యక్తి వేసిన మాస్టర్ ప్లాన్ తో ఈ కథ ఉత్కంఠను రేపుతోంది. ‘భామాకలాపం 2’ సినిమాను .. ఈ భాగం వరకే చూసుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. దీనికంటే ముందుగా వచ్చిన మొదటి భాగంతో పోల్చుకుంటే మాత్రం తక్కువ మార్కులనే తెచ్చుకుంటుంది. ఈ కథలో మాఫియా నేపథ్యానికి ఎక్కువ వాటాను కేటాయించడమే అందుకు కారణమనుకోవాలి.