చంద్రబాబునాయుడు గత 35 ఏళ్ళుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈ ఎన్నికల్లో ఆయనకు విశ్రాంతి ఇద్దామని, ఆయన బదులు పోటీచేయాలనే ఆలోచన తనకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ కోరిక తన మనసులో వచ్చిందన్నారు.
‘నిజం గెలవాలి’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోన్న నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ వారికి ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీనితో పాటు మూడు అన్నా క్యాంటిన్లు ప్రారంభించేందుకు ఆమె కుప్పం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ పోటీ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది తన మనసులో మాట అని కార్యకర్తలతో అన్నారు. అంతకుముందు మరో కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కోసం 23 రోజులు సైకిల్ యాత్ర చేసిన యువకులను కలుసుకుని వారిని అభినందించి హెల్మెట్లు పంచిపెట్టారు.
కాగా, భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. కుప్పంలో బాబుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే అక్కడినుంచి పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని, భువనేశ్వరి నేటి వ్యాఖ్యలు బాబు ప్రణాళికలో భాగమేనని వారు అంటున్నారు.