ఇటీవల ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేసి మెగా డిఎస్సీ నిర్వహించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చిన ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలను గత అర్ధరాత్రి నుంచే పోలీసులు అదుపులోకి తీసుకుని కొంతమందిని గృహ నిర్భందం చేశారు. నిన్న గన్నవరం చేరుకున్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల గత రాత్రి విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో బసచేశారు. ఈ ఉదయం పోలీసులు ఆమెను నిలువరించడంతో పార్టీ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. తనను చూసి జగన్ సర్కార్ భయపడుతోందని, వేలాది మంది పోలీసులను మొహరించి అడ్డుకుంటున్నారని, ఇది హేయమైన చర్య అని షర్మిల ఆరోపించారు. దగా డిఎస్సీ వద్దు- మెగా డిఎస్సీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు-పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.
అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి సచివాలయానికి బయలుదేరిన షర్మిలను కరకట్ట వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు.