తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని బాబు నివాసంలో వీరి భేటీ జరిగింది. కూటమి అభ్యర్థుల రెండవ జాబితా ప్రకటన వీలైనంత త్వరగా చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి చేరుతుందా లేదా అనేదానిపై స్పష్టత కోసం రేపో మాపో ఇరువురు నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.
నిన్న మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది. రాబోయే కాలంలో సామాజికవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
మరోవైపు బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో పొత్తుల అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆమె అధిష్టానాన్ని కోరే అవకాశం ఉంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహుల జాబితాను పురందరేశ్వరి బిజెపి కేంద్ర పెద్దలకు అందజేయనున్నారు. త్వరలో జరగనున్న బిజెపి పార్లమెంటరీ పార్టీ భేటీలో పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.