ఏ విధమైనటువంటి సైంటిఫిక్ డేటా లేకుండానే ప్రశాంత్ కిషోర్ వైసిపి విజయావకాశాలపై మాట్లాడారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ భారీ ఓటమి చెందబోతున్నారంటూ ఇటీవల ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ప్రశాంత్ కిశోర్ దురుద్దేశంతోనే ఇలా మాట్లాడి ఉంటారని… అయితే ఆయన మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. గట్ ఫీలింగ్ తోనే ఈ అభిప్రాయం చెబుతున్నట్లు పీకే స్వయంగా చెప్పిన మాటలను ఈ సందర్భంగా విజయసాయి ప్రస్తావించారు.
అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వం వెనుకబడి ఉందన్న వాదనను ఆయన కొట్టి పారేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని… వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలవబోతున్నామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారి విజయసాయి నేడు నెల్లూరుకు వెళ్ళారు. వేలాదిమంది పార్టీ శ్రేణులతో కలిసి కందుకూరు నియోజకవర్గం కరేడు ర్యాంపు నుంచి మొదలైన ర్యాలీ. కావలి, కోవూరు నియోజకవర్గాల మీదుగా నెల్లూరుకు చేరుకుంది. ర్యాలీలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా హృదపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.