ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై నిన్నటి నుంచి ‘వళరి’ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రితికా సింగ్ – శ్రీరామ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సాధారణంగా హారర్ సినిమాలన్నీ ఒక పాడుబడిన బంగాళాలోనే నడుస్తూ ఉంటాయి. తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో పరిగెడుతూ ఉంటాయి. అదే పద్ధతిని ఈ సినిమా కూడా ఫాలో అవుతూ వచ్చింది.
దెయ్యాలు పాడుబడిన బంగ్లాలో ఉండటం .. అందులోకి దిగినవారిని భయపెట్టడం చాలా కథల్లో చెబుతూ వచ్చిందే .. చాలా కాలంగా చూస్తూ వచ్చిందే. అయితే ఈ సినిమాలో ‘వళరి’ అనే ఆయుధం చూపించారు .. ఈ సినిమా టైటిల్ కూడా ఇదే. కథలో ఏ అంశాన్ని గురించి అయితే బలంగా చెబుతామో .. ఏ అంశానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందో .. దానికి సంబంధించినదే టైటిల్ గా సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సినిమా విషయంలోను జరిగి ఉంటుందని అనుకోవడం సహజం.
ఈ సినిమాలో ప్రాచీన కాలం నాటి ఆ ఆయుధం గురించిన ప్రస్తావన పట్ల ఆసక్తితో ఆడియన్స్ కథను ఫాలో అవుతారు. కానీ ‘వళరి’ గురించిన ప్రస్తావన చాలా సాదాసీదాగా .. నామ మాత్రంగా మాత్రమే ఉంటుంది. ఎక్కడైతే కొత్తదనాన్ని ఆశించిన ప్రేక్షకుడు కథలోకి ఎంటరవుతాడో అక్కడ ఆడియన్స్ కి నిరాశనే ఎదురవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో నాయిక తల్లి పాత్రకి కర్రసాములో ఎంతటి ప్రావీణ్యం ఉందనేది చూపించారు. ‘వళరి’ ఆయుధాన్ని ప్రయోగించడమనే అంశాన్ని అలా హైలైట్ చేసి ఉంటే, టైటిల్ కి ఒక ప్రయోజనం ఉండేదనిపిస్తుంది.